
పంజాబ్, హిమాచల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు..
చండీగఢ్ : మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంజాబ్, హర్యానా సహా ఉత్తరాది రాష్ట్రాలు తడిసిముద్దయ్యాయి. భారీ వర్షాలతో పంజాబ్‌లో వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో వరద పరిస్థితి నెలకొనడంతో ఆ ప్రాంతంలోనూ హై అలర్ట్ ప్రకటించారు. కాంగ్రా జిలాలలోని నహాద్ ఖాడ్ గ్రామంలో వరద నీటిలో చిక్కుకుని భీతిల్లిన ఓ వ్యక్తి మరణించాడు. పంజాబ్‌లో ఆగకుండా కురుస్తున్న వర్షాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి..
అతివృష్టితో రాష్ట్రంలో పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సూచించారు. విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేయాలని కోరారు. మరోవైపు ఎలాంటి విపత్కర పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనేందుకు సైన్యం సేవలను ఉపయోగించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సహాయ, పునరావస ప్రణాళికపై కసరత్తు చేయాలని అధికారులను సీఎం అమరీందర్ సింగ్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా అమృత్‌సర్ జిల్లాలోని స్కూళ్లకు అమృత్‌సర్ డిప్యూటీ కమీషనర్ సోమవారం సెలవు ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు అధికారులు తెలిపారు.