Redalert
-
భారీ వరద : 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్
పట్నా : బిహార్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో బిహార్ రాజధాని పట్నా సహా పలు ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ వరదలతో జనజీవనం స్తంభించగా 15 జిల్లాల్లో రెడ్అలర్ట్ ప్రకటించారు. వరద పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. మధుబని, సపౌల్, అరరియ, కిషన్‌గంజ్, ముజఫర్‌పూర్, బంకా, సమస్తిపూర్, మధేపుర, సహస, పుర్నియ, దర్భంగ, భాగల్పూర్, ఖగారియా, కతిహార్, వైశాలి జిల్లాల్లో అధికారులు రెడ్అలర్ట్ ప్రకటించారు. మరోవైపు తర్పూ చంపరన్, శివ్‌హర్, బెగుసరై, సీతామర్హి, సరన్, సివన్ ప్రాంతాల్లోనూ వరద తాకిడి అధికంగా ఉంది. కాగా రాగల 24 గంటల్లో బిహార్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక వరద పరిస్థితిపై బిహార్ సీఎం నితీష్ కుమార్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. -
ఎయిర్‌పోర్ట్‌ల్లో భద్రత కట్టుదిట్టం
న్యూఢిల్లీ\ముంబై : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులపై నిఘా సంస్థల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. అవాంఛనీయ ఘటనలను నిరోధించేందుకు భద్రతను ముమ్మరం చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ సెక్యూరిటీ అడ్వైజరీని జారీ చేసింది. విమానాశ్రయాలతో పాటు కీలక స్ధావరాల వద్ద భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేయాలని కోరింది. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370ను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఉగ్రవాదులు విమానాశ్రయాలను తమ టార్గెట్‌గా ఎంచుకుని విరుచుకుపడవచ్చని నిఘా సంస్థలు సమాచారం అందించాయి. -
చెన్నైని ముంచెత్తిన వర్షాలు
సాక్షి, చెన్నై: భారీ వర్షాలతో చెన్నై నగరం సహా తమిళనాడు తడిసిముద్దయింది. తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం దక్షిణాది తీరంలో కుండపోత ప్రారంభమైంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని స్కైమెట్ వెదర్ అంచనా వేసింది. కుండపోతతో చెన్నైలో నేడు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సహాయ పునరావాస కమిషనర్ పేర్కొన్నారు. 2015లో చెన్నైని వణికించిన వరద బీభత్సంతో ముందు జాగ్రత్త చర్యలకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. మరోవైపు కేరళలో సైతం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనాతో ఇటీవల వరదలతో తల్లడిల్లిన క్రమంలో అధికారులు తాజా రెడ్ అలర్ట్‌తో అప్రమత్తమయ్యారు. ఇడుక్కి, మలప్పురం జిల్లాల అధికారులు ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధమయ్యారు. కర్ణాటకలోనూ విస్తారంగా వర్సాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించడంతో దక్షిణ కర్నాటకలోని 12 జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. -
రెడ్అలర్ట్ : కేరళలో మలంపుజ డ్యామ్ గేట్ల ఎత్తివేత
కొచ్చి : కేరళను మరోసారి వరద భయం వెంటాడుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ వారాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరికలతో ఇరు రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో పలక్కాడ్‌లోని మలంపుజ డ్యామ్ గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు. మలంపుజ డ్యామ్‌కు చెందిన నాలుగు గేట్లను 9 సెంమీ చొప్పున అధికారులు ఎత్తివేశారు. ఐఎండీ సూచనల నేపథ్యంలో మూడు తీర ప్రాంత జిల్లాల్లో ఈనెల ఏడున రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈనెల 5 నాటికి మత్స్యకారులు సురక్షిత తీర ప్రాంతానికి వెళ్లాలని ప్రభుత్వం కోరిందని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమై పరిస్థితిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. -
ఉత్తరాదిన రెడ్అలర్ట్
చండీగఢ్ : మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంజాబ్, హర్యానా సహా ఉత్తరాది రాష్ట్రాలు తడిసిముద్దయ్యాయి. భారీ వర్షాలతో పంజాబ్‌లో వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో వరద పరిస్థితి నెలకొనడంతో ఆ ప్రాంతంలోనూ హై అలర్ట్ ప్రకటించారు. కాంగ్రా జిలాలలోని నహాద్ ఖాడ్ గ్రామంలో వరద నీటిలో చిక్కుకుని భీతిల్లిన ఓ వ్యక్తి మరణించాడు. పంజాబ్‌లో ఆగకుండా కురుస్తున్న వర్షాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.. అతివృష్టితో రాష్ట్రంలో పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సూచించారు. విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేయాలని కోరారు. మరోవైపు ఎలాంటి విపత్కర పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనేందుకు సైన్యం సేవలను ఉపయోగించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సహాయ, పునరావస ప్రణాళికపై కసరత్తు చేయాలని అధికారులను సీఎం అమరీందర్ సింగ్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా అమృత్సర్ జిల్లాలోని స్కూళ్లకు అమృత్సర్ డిప్యూటీ కమీషనర్ సోమవారం సెలవు ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు అధికారులు తెలిపారు. -
మన్యంలో రెడ్అలెర్ట్
ఏవోబీలో ముమ్మర గాలింపు మావోయిస్టుల కదలికలపై నిఘా పాడేరు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) పరిధిలోని ఎంబీకే డివిజన్లో ఈ నెల 6,7 తేదీల్లో బంద్‌కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు మన్యంలో రెడ్అలెర్ట్ ప్రకటించారు. ఈ నెల ఒకటి నుంచి 7వ తేదీ వరకు దళసభ్యులు నిర్బంధ వ్యతిరేక నిరసన దినాలు పాటిస్తున్నారు. దీంతో మారుమూల గూడేల్లో బేనర్లు, పోస్టర్లు అతికించి 6,7 తేదీల్లో బంద్‌ను విజయవంత చే యాలని ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏవోబీలో భద్రత బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. కూంబింగ్‌తో ముమ్మర గాలింపు చేపడుతున్నాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా పెరిగింది. మండల కేంద్రాలు, కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు, మిలీషియా వ్యవస్థ కదలికలపై నిఘా పెంచారు. ప్రజాప్రతినిధులకు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుతో ఏజెన్సీ అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.