సాక్షి, చెన్నై: భారీ వర్షాలతో చెన్నై నగరం సహా తమిళనాడు తడిసిముద్దయింది. తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం దక్షిణాది తీరంలో కుండపోత ప్రారంభమైంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని స్కైమెట్ వెదర్ అంచనా వేసింది. కుండపోతతో చెన్నైలో నేడు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
భారీ వర్షాలతో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సహాయ పునరావాస కమిషనర్ పేర్కొన్నారు. 2015లో చెన్నైని వణికించిన వరద బీభత్సంతో ముందు జాగ్రత్త చర్యలకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. మరోవైపు కేరళలో సైతం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనాతో ఇటీవల వరదలతో తల్లడిల్లిన క్రమంలో అధికారులు తాజా రెడ్ అలర్ట్‌తో అప్రమత్తమయ్యారు.
ఇడుక్కి, మలప్పురం జిల్లాల అధికారులు ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధమయ్యారు. కర్ణాటకలోనూ విస్తారంగా వర్సాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించడంతో దక్షిణ కర్నాటకలోని 12 జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment