
బిహార్‌ను భారీ వర్షాలు ముంచెత్తడంతో పలు జిల్లాలు వరద తాకిడికి లోనయ్యాయి.
పట్నా : బిహార్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో బిహార్ రాజధాని పట్నా సహా పలు ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ వరదలతో జనజీవనం స్తంభించగా 15 జిల్లాల్లో రెడ్‌అలర్ట్ ప్రకటించారు. వరద పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 20 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. మధుబని, సపౌల్, అరరియ, కిషన్‌గంజ్, ముజఫర్‌పూర్, బంకా, సమస్తిపూర్, మధేపుర, సహస, పుర్నియ, దర్భంగ, భాగల్పూర్, ఖగారియా, కతిహార్, వైశాలి జిల్లాల్లో అధికారులు రెడ్‌అలర్ట్ ప్రకటించారు. మరోవైపు తర్పూ చంపరన్, శివ్‌హర్, బెగుసరై, సీతామర్హి, సరన్, సివన్ ప్రాంతాల్లోనూ వరద తాకిడి అధికంగా ఉంది. కాగా రాగల 24 గంటల్లో బిహార్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక వరద పరిస్థితిపై బిహార్ సీఎం నితీష్ కుమార్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.