కరోనా వైరస్ విరహ వేదనతో కొందరిని కష్టాల కడలిలో ముంచేస్తే మరికొందరిని సుఖసంతోషాలతో నదుల కెరటాలపై తేలియాడుతూ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అని పాడుకునేలా చేసిందట. పెద్దలకు టోకరా వేసి రిజిస్టర్ మ్యారేజీ చేసుకునే ప్రేమికులకు కరోనా వైరస్ చెక్ పెట్టిందని రిజిస్ట్రార్‌శాఖ అధికారి ఒకరు బయటపెట్టారు. లాక్‌డౌన్ పుణ్యమానితమ పిల్లలు సేఫ్ అంటూ పెద్దలు సంబరపడుతున్నారని ఆయన చమత్కరించారు.
సాక్షి, చెన్నై : పెద్దలు నిశ్చయించే వివాహాలకు దాదాపు కాలం చెల్లిపోగా ప్రేమ పెళ్లిళ్లవైపే నేటి యువతరం మొగ్గుచూపుతోంది. అమ్మాయి లేదా అబ్బాయిని ఖరారు చేసుకునే ముందు గతంలో పెద్దలు కుల గోత్రాలతోపాటు అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలను ఆరా తీసేవారు. ఇరుపక్షాల పెద్దల సమ్మతితో బంధుమిత్రుల సమక్షంలో జరిగే వివాహాలకు ఒక భద్రత ఉంటుందని గతంలో పిల్లలు కూడా విశ్వసించేవారు. వాటన్నింటినీ నేటి తరం చాదస్తంగా కొట్టిపారేస్తోంది. పెద్దలు చేసిన వివాహాలు పెటాకులు కాలేదా, మూడు ముళ్ల బంధం మూణ్ణాళ్ల ముచ్చటై విడాకులకు దారతీయాలేదా అని వాదిస్తోంది. కలిసి జీవించేది మేము కాబట్టి జీవిత భాగస్వామిని కూడా మేమే ఎంచుకుంటాం, మీకు నచ్చితే ఓకే, నచ్చకున్నా ఓకే పెళ్లి మాత్రం ఆగదని ఖరాఖండిగా చెబుతున్నారు. ఇళ్ల నుంచి పారిపోయి స్నేహితులే పెళ్లి పెద్దలుగా రిజిస్టర్ మ్యారేజీలు చేసేసుకుంటున్నారు.
అమ్మాయి, అమ్మాయి తరఫువారికి తెలియకుండానే పెళ్లిళ్లు రిజిస్టర్ కావడం, విదేశాల్లో ఉన్నవారితో పెళ్లి జరిగినట్టుగా నమోదు చేయడం వంటి ఘటనలు జరిగేవి. ఇలాంటి సందర్భాల్లో వధూవరుల తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రిజిస్ట్రార్ ఆఫీసులో అడ్డుకోవడం, భిన్న కులమతాల వారైతే పరువు హత్యలకు సైతం దారితీయడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈ వివాదాలు కోర్టు కేసులుగా మారినపుడు రిజిస్ట్రార్, పెళ్లి చేసుకున్నవారు, సాక్షి సంతకం పెట్టినవారు అంతా చిక్కుల్లో పడిపోతున్నారు. వివాహం రిజిస్టర్ చేయాలంటే వధూవరులు ఇద్దరూ రిజిస్ట్రార్ సమక్షంలో నిలవాలని, పెద్దల సమక్షంలోనే పెళ్లి జరిగినా వివాహ సంప్రదాయ దుస్తులతోనే రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లడం, వివాహ వేడుకను వీడియోలో విధిగా చిత్రీకరించడం, పెళ్లి ఫొటో, శుభలేఖ జతచేయడం వంటి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కాగా ప్రపంచమంతా కరోనా విలయతాండవం చేస్తున్న దశలో అన్ని వ్యవహారాలు స్తంభించి పోయాయి. లాక్‌డౌన్‌తో అనేక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కరోనా వైరస్ వేళ ఇలాంటి ప్రేమ వివాహాలకు కళ్లెం పడింది.
ప్రేమకు సై..పెళ్లి మాత్రం నై
పెద్దలకు తెలియకుండా మరికొంతకాలం ప్రేమకు సై..పెళ్లి మాత్రం ఇప్పట్లో నై అనే పరిస్థితులు నెలకొన్నాయని, తద్వారా పెద్దలకు తెలియకుండా జరుగుతున్న పెళ్లిళ్లతో తలెత్తే తలనొప్పులు తగ్గిపోయాయని ఆనందపడిపోతున్నట్లు రిజిస్ట్రార్ అధికారులు అంటున్నారు. లాక్‌డౌన్ వల్ల దాదాపుగా అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని నెలలు కొనసాగవచ్చు. ఆఫీసు పేరుతో బయటకు వచ్చి పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ప్రేమికులకు లేకుండా పోయిందని అంటున్నారు. ఇళ్ల నుంచి పారిపోయి పెద్దలకు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజీలు చేసుకునేవారితో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కరోనా వైరస్ వల్ల అందరితోపాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రేమికుల వల్ల వచ్చే తిప్పల నుంచి మాత్రం తప్పించుకున్నామని తెలిపారు.
ఆలయాల్లో పెళ్లి చేసుకుని అక్కడ ఇచ్చే రశీదును చూపి కూడా కొందరు రిజిస్టర్ చేసుకునేవారు. లాక్‌డౌన్ వల్ల ఆలయాల తలుపులు కూడా మూసివేయడం వల్ల ఆ బాధ కూడా తప్పిందని చెప్పారు. రాష్ట్రంలో నమోదయ్యే రిజిస్టర్ వివాహాల్లో 5 శాతం పెద్దలకు తెలియకుండా చేసుకున్నవేనని అన్నారు. అందులోనూ అధిక శాతం చెన్నైలో జరుగుతున్నాయని తెలిపారు. లాక్‌డౌన్ వల్ల ఇళ్ల నుంచి పారిపోయి చేసుకునే వివాహాలే కాదు, పెద్దల సమక్షంలో వివాహం చేసుకుని రిజిస్ట్రారు కార్యాలయానికి వచ్చేవారి 50 శాతం కంటే తక్కువగా ఉందని అన్నారు. 2019–20లో 1.32 లక్షల రిజిస్టర్ మ్యారేజీలు జరగగా ఇక ఈ ఏడాదిలో ఇంతవరకు 50 వేలు కూడా దాటలేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment