
హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు ఊరట
ట్రయల్ కోర్టు ఆదేశాలను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు ఊరట లభించింది. కేసుకు సంబంధించి 2010-11 నాటి కాంగ్రెస్ బ్యాలెన్స్ షీట్, ఇతర పత్రాలను సమర్పించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్ వాదన మాత్రమే విని ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉందని పేర్కొంది. ట్రయల్ కోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ నేతలు, యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ హైకోర్టులో అప్పీలు చేయగా.. దీనిపై విచారించిన జస్టిస్ పీఎస్ తేజీ.. ట్రయల్ కోర్టు ఆదేశాలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నా యన్నారు.
హెరాల్డ్ ఆస్తుల విక్రయంలో అక్రమాలు జరిగాయని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేయడం తెలిసిందే. కాంగ్రెస్‌కు చెందిన 2010-11 నాటి ఆర్థిక వివరాలకు సంబంధించి పత్రాలను అందజేయాలని, కేంద్ర ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖలు, కార్పొరేట్ వ్యవహారాలు, ఆదాయపన్ను విభాగాలను, కాంగ్రెస్‌ను జనవరి 11, మార్చి 11న ట్రయల్ కోర్టు ఆదేశించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో దరఖాస్తును పూర్తిగా పరిశీలించకుండా, ప్రతివాదుల వాదన వినకుండా ఆదేశాలు ఇవ్వడం చట్టరీత్యా చెల్లుబాటు కాదంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతున్నట్టు స్పష్టం చేసింది.