
సారథి అనగానే కృష్ణుడు, లేదంటే శల్యుడు గుర్తొస్తారు గానీ నిజానికి ఉత్తర గోగ్రహణ వేళ బృహన్నల రూపంలో అర్జునుడు ప్రదర్శించే రథచోదన ప్రావీణ్యం నభూతో! గాలితో పందెం వేస్తూ వాయువేగ మనోవేగాలతో రథాన్ని పార్థుడు పరుగులెత్తిస్తుంటే ఉత్తర కుమారుడికి పై ప్రాణాలు పైనే పోతాయి. దేశీయ విమానయానాన్ని కూడా అదే తరహాలో ఉరకలెత్తించనున్నట్టు ప్రకటించారు జైట్లీ. రైల్వేల ఆధునీకరణనూ వేగవంతం చేస్తామన్నారు..
న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్‌లో రైల్వేలు ‘వైఫై’ కూత పెట్టాయి. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో దశలవారీగా వైఫై సదుపాయం కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018–19 బడ్జెట్‌లో ప్రకటించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణతోపాటు ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమైన కొత్త రైళ్లు ఏవీ ప్రకటించకపోవటం ఈసారి బడ్జెట్‌లో నిరాశ కలిగించే అంశం. రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టే 92 ఏళ్ల సంప్రదాయానికి గత ఏడాది ముగింపు పలికి కేంద్ర బడ్జెట్‌లో కలపటం తెలిసిందే.
3,600 కి.మీ రైల్వే లైన్ల పునరుద్ధరణ
రైల్వేలకు ఈసారి బడ్జెట్‌లో 1,48,528 లక్షల కోట్లను కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 13 శాతం అదనం. గత ఏడాది బడ్జెట్‌లో రైల్వేలకు రూ.1.31 లక్షల కోట్లు కేటాయించారు. రైల్వేలను పరిపుష్టం చేసి రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచనున్నట్లు అరుణ్‌జైట్లీ చెప్పారు. ‘రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్’ కింద నిధులు కేటాయించి ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. దేశవ్యాప్తంగా 18 వేల కి.మీ. డబ్లింగ్, 5 వేల కి.మీ. మేర 3, 4 లైన్ల ట్రాక్‌లుగా మార్చటం వల్ల రైల్వే నెట్‌వర్క్ దాదాపుగా బ్రాడ్‌గేజ్‌లోకి మారుతుందని జైట్లీ చెప్పారు. రైల్వే ట్రాక్‌ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, 3,600 కి.మీ మేర రైల్వే లైన్లను పునరుద్ధరించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు.
‘ట్రైన్ 18’.. ‘ట్రైన్ 20’
ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభూతి కోసం ప్రపంచశ్రేణి రైళ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా చెన్నైలోని కోచ్‌ల తయారీ కేంద్రంలో ‘ట్రైన్ 18’, ‘ట్రైన్ 20’ తయారు కానున్నాయి. జర్మనీకి చెందిన లింక్ హాఫ్‌మాన్ బాష్ టెక్నాల జీతో తయ్యారయ్యే ఈ ప్రయాణికుల రైళ్లు 2018లో ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో ‘ట్రైన్ 18’ అని వ్యవహరిస్తున్నారు. గంటకు 160 కి.మీ వేగంతో దూసుకెళ్లటం వీటి ప్రత్యేకత. ఇక ‘ట్రైన్ 20’ మరింత ఆధుని కంగా స్లీపర్ కోచ్‌లతో ఉంటుంది. 2020లో ఇది అందుబాటులోకి రానుంది. వంద రైళ్లను ఉత్పత్తి చేసి శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థానంలో ప్రవేశపెట్టే యోచన ఉన్నట్లు రైల్వే మంత్రి గోయల్ తెలిపారు.
రూ.3 వేల కోట్లతో సీసీటీవీలు
దేశవ్యాప్తంగా 11 వేల రైళ్లలో 12 లక్షల సీసీటీవీ కెమెరాల కోసం రైల్వే శాఖ రూ. 3 వేల కోట్లను వ్యయం చేయనుంది. 8,500 స్టేషన్లు సీసీటీవీల నిఘాలో ఉంటాయి. ప్రతి బోగీకి 8 సీసీటీవీలను అమరుస్తారు. ప్రస్తుతం 395 స్టేషన్లు, 50 రైళ్లను సీసీటీవీలతో అనుసంధానించారు. వచ్చే రెండేళ్లలో ప్రతి రైలులో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ప్రయాణికుల సదుపాయాల కోసం ఈసారి రూ.1,657 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం ఎక్కువ.
రైల్వేలకు ఇచ్చినవి..
►రైల్వేస్టేషన్ల పరిసరాలలో వాణిజ్య సముదాయాల అభివృద్ధి
►పెరంబూర్‌లోని రైల్వే కోచ్‌ల తయారీ పరిశ్రమలో అధునాతన కోచ్‌ల నిర్మాణం. 2018–19లో తొలి రైలు పట్టాలపై పరుగులు తీయనుంది.
►రైల్వే సిబ్బందికి శిక్షణ కోసం వడోదరలో ఇన్‌స్టిట్యూట్.
►భారత రైల్వే స్టేషన్ల అభివృద్ధి కంపెనీ లిమిటెడ్ ద్వారా 600 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి
►25,000 మించి ప్రయాణికులు రాకపోకలు సాగించే అన్ని రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు.
►వచ్చే రెండేళ్లలోగా బ్రాడ్ గేజ్ పరిధిలో కాపలా లేని 4,267 రైల్వే గేట్ల తొలగింపు.
►ముంబై రైళ్లలో రద్దీ నివారణకు 90 కి.మీ. మేర రూ.11 వేల కోట్లతో డబుల్ లైన్ల పనులకు నిర్ణయం.
►సిగ్నలింగ్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధునీకరణ కోసం రూ. 2,025 కోట్లు
►రైల్వే ట్రాక్‌ల నవీకరణ కోసం రూ.11,450 కోట్లు
►రాష్ట్రీయ రైల్ సంరక్షణ కోష్ తదితరాల కింద ప్రయాణికుల భద్రత కోసం రూ.73,065 కోట్లు
బడ్జెట్ హైలైట్స్
►వయోధిక పౌరుల బ్యాంకు, పోస్టాఫీస్ డిపాజిట్ల వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రూ.10 వేల నుంచి రూ.50 వేలకు పెంపు.
►సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులు, వైద్య బీమా ప్రీమియంపై రూ.50 వేల వరకూ అదనపు రాయితీ.
►ఈక్విటీ మార్కెట్‌లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.లక్ష దాటిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 10 శాతం పన్ను
►విద్యా, వైద్య సెస్సు 3 నుంచి 4 శాతానికి పెంపు.
►ప్రతి మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు.
►ప్రభుత్వ బీమా కంపెనీల విలీనం.
►టామాటో, ఉల్లి, ఆలు ఉత్పత్తికి రూ. 500 కోట్లతో గ్రీన్ ఆపరేషన్ పథకం.
►విదేశీయులను ఆకర్షించేం దుకు 10 ప్రధాన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి.
1851 డిసెంబర్ 22
భారత్‌లో తొలి రైలు 1851 డిసెంబర్ 22న పట్టాలెక్కింది. రూర్కీలో నిర్మాణ సామగ్రితో అది ప్రయాణించింది. ప్రయాణికుల రైలు మాత్రం 1853 ఏప్రిల్ 16న బాంబే నుంచి థానే మధ్య (34 కిలోమీటర్లు) నడిచింది. దీన్నే భారత్‌లో తొలి రైలుగా పేర్కొంటారు.
1925 ఫిబ్రవరి 3
తొలి ఎలక్ట్రిక్ రైలు 1925 ఫిబ్రవరి 3న బాంబే వీటీ, కుర్లా మధ్య నడిచింది. రైళ్లలో తొలిసారిగా 1891లో టాయిలెట్‌లు(ఒకటో తరగతిలో) ప్రవేశపెట్టారు. దిగువ తరగతుల్లో 1907లో వాటిని ఏర్పాటుచేశారు. తొలి రైల్వే వంతెన.. ముంబై–థానే మార్గంలోని దపూరీ వయాడక్ట్
ఇప్పుడంటే సెకండ్ క్లాస్ స్లీపర్. అప్పట్లో థర్డ్ క్లాస్ స్లీపర్ కూడా ఉండేది. అదే ఇది. మూడు వరుసలలో స్లీపర్ బెర్తులుండేవి.
రాజావారి రైలు
ఇది రాజావారి రైలు. రాచరిక వ్యవస్థ ఉన్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి తన కుటుంబంతో కలిసి గుణుపూర్ నుంచి నౌపడ ఉప్పు గల్లీల వరకు, అటు నుంచి తీర ప్రాంత సందర్శనకు వీలుగా ప్రత్యేక రైల్వే లైనునే నిర్మించుకున్నారు. నౌపడ–గుణుపూర్‌ల మధ్య నిర్మించిన నేరో గేజ్ రైల్వే లైన్‌ను 1912లో ఆయన జాతికి అంకితమిచ్చారు. ఆ తర్వాత 1953లో భార త ప్రభుత్వం ఈ రైల్వే లైన్‌ను స్వాధీనం చేసుకున్నా.. దశాబ్దం క్రితం వరకు ఈ లైను దశ మారలేదు. అదే నేరో గేజ్.. అదే రాజావారి బండి కొనసాగాయి. 2002లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చాలని ప్రతిపాదించింది. ఎట్టకేలకు 2010లో బ్రాడ్‌గేజ్ నిర్మాణం పూర్తయ్యింది. 2011 డిసెంబర్‌లో పూరి–పర్లాకిమిడి మధ్య బ్రాడ్‌గేజ్ రైలు ప్రయాణం ప్రారంభమైంది.
ఐసే ఏసీ
ఇది భారత్‌లో తొలి ఏసీ రైలు ఫ్రాంటియర్ మెయిల్. దీన్ని 1934లో ప్రారంభించారు. అప్పట్లో ఏసీ అంటే.. ఇలా పెద్ద పెద్ద ఐస్ గడ్డల్ని బోగీకి రెండు చివర్లా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేసేవారు. బ్యాటరీ ద్వారా పనిచేసే బ్లోయర్ ద్వారా ఈ బాక్సుల్లోకి గాలిని పంపిస్తే.. అది ప్రత్యేకంగా ఉన్న చిల్లుల ద్వారా ఇన్సులేటెడ్ బోగీల్లోకి వెళ్లేది. అలా బోగీల్లోపల చల్లదనం ఉండేలా చేసేవారు. ఒక ఐస్ గడ్డ కరిగిపోయాక మరొకటి వేసేందుకు వీలుగా.. రైలు వెళ్లే మార్గంలో కొన్ని చోట్ల ఇలా ఐస్ గడ్డలను సిద్ధంగా ఉంచేవారు. ఈ రైలును ఎక్కువగా బ్రిటిష్ వాళ్లు ప్రయాణించడానికి వాడేవారు.
ప్రత్యేక బడ్జెట్ సమస్యలనే మిగిల్చింది: పీయూష్ గోయల్
రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టే అవకాశాన్ని కోల్పోయినట్లుగా తానేమీ భావించటం లేదని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పా రు. నిజానికి రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టటం రైల్వేలకు సమస్యలనే మిగిల్చిందన్నారు. రైల్వే మంత్రి చేతుల మీదుగా ఏదైనా కొత్త రైలు పేరును ప్రకటించాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు తనకు ప్రయాణికుల భద్రతే, సౌకర్యమే ముఖ్యమన్నారు. ‘ప్రతి రైలుకు, ప్రతి బోగీకి సిబ్బంది ద్వారా భద్రత కల్పించటం ఖరీదైన ప్రక్రియ. ఈ నేపథ్యంలో అన్ని రైళ్లు, బోగీల్లో సీసీ కెమెరాలు, వైఫై వైపు దృష్టి పెట్టాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment