
వారం రోజుల్లో పెళ్లి ఉందనగా..
గయా: మరో వారం రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు... దోపిడీ దొంగల ఘాతుకానికి చేతి వేళ్లను కోల్పోయాడు. దోచుకునేందుకు అతడి వద్ద విలువైన ఆభరణాలేమీ లేకపోవడంతో దుండగులు ...అతని ఎడమ చేతి నాలుగు వేళ్లను కత్తిరించేశారు. వివరాల్లోకి వెళితే గయాకు చెందిన కపిల్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. జూన్ 3వ తేదీని అతడి వివాహం నిశ్చయం కావడంతో వెడ్డింగ్ కార్డులు ఇచ్చేందుకు వెళ్లాడు. పెళ్లి పత్రికలు ఇచ్చి గయా నుంచి బోధ్ గయాలోని తన ఇంటికి తిరిగి వస్తుండగా కపిల్ కుమార్‌ను దారి కాచి దుండగులు అడ్డుకున్నారు. అతడి విలువైన దుస్తులు చూసి కపిల్ వద్ద భారీగా బంగారు ఆభరణాలు ఉంటాయని అంచనా వేశారు.
అయితే అతడి వద్ద గోల్డ్ చైన్, బ్రాస్‌లెట్, కనీసం బంగారపు ఉంగరం కూడా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కసు కొద్ది కపిల్ చేతివేళ్లను కత్తిరించి, అనంతరం అతడిని పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి తోసేశారు. అక్కడ నుంచి ఎలాగో అలా బయటపడ్డ కపిల్ బోధ్ గయా పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా తన వద్ద విలువైన ఆభరణాలు ఏమీ లేకపోవడంతో దుండగుల్లో ఒకడు...తనను చంపేయాలని తోటివారికి సూచించాడని, అయితే తన అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులకు వివరించాడు. ప్రస్తుతం పెళ్లికొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.