రోడ్ల కోసం ఏడాదికో లక్ష కోట్లు!!
దేశంలో ఉన్న జాతీయ రహదారులన్నింటినీ రెండేళ్లలో అద్భుతంగా తయారుచేయాలని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందుకోసం ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించనుంది. ఈ విషయాన్ని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు రవాణా రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై తాను నెల రోజుల్లోగా ఓ బ్లూప్రింట్ రూపొందిస్తానని, ఏడాదికి లక్ష కోట్ల వరకు కేటాయిస్తానని, రెండేళ్లలోనే ఫలితాలు కనిపిస్తాయని కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో జరిగిన ఓ సదస్సులో గడ్కరీ చెప్పారు.
గత ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శిస్తూ కేంద్రప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేసిన ఏడాది తర్వాత గడ్కరీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. భూసేకరణ సరిగా చేయకపోవడం వల్ల ఈ రంగం దారుణంగా తయారైందని, జాతీయ రహదారుల సంస్థ చేపట్టిన ప్రాజెక్టులలో 60 శాతం వరకు ఇప్పుడు వివాదాల్లో మునిగిపోయాయని శ్వేతపత్రంలో తెలిపారు. దేశ ప్రజలకు మంచిరోజులు రానున్నాయని, జాతీయ రహదారుల రంగంలో జాతి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు నెల రోజుల్లోగా బిల్లులు మంజూరవుతాయని అన్నారు.