
18.5కోట్లు పట్టివేత... 32 మంది అరెస్ట్
తిరువనంతపురం: ఎన్నికల ప్రచారం మొదలైదంటే చాలు నల్లధనం ఎక్కడున్నా సరే జనాల్లోకి వస్తుంది. రాజకీయ పార్టీలు సామాన్య ప్రజలను నోట్ల కట్టలతో ప్రలోభపెడుతుంటారని ఆరోపణలు వస్తుంటాయి. ఈ విషయం తాజాగా మరోసారి కేరళ ఎన్నికల సమయంలో రుజువైంది. 18.5 కోట్ల రూపాయల నగధు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ సొమ్మును కలిగిఉన్న కారణంగా 32 మందిని అరెస్ట్ చేసినట్లు ఆదాయపన్నుశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. గతంలో ఎప్పుడు ఇంత సొమ్మును తక్కువ కాలంలో పట్టుకోలేదని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ పి. విజయన్ తెలిపారు. మే 16న కేరళ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
పొరుగురాష్ట్రాల నుంచి కేరళకు కూడా చాలా మార్గాల్లో ధనప్రవాహం మొదలైనట్లు కనిపిస్తోందన్నారు. ఎక్కడ అనుమానితులు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వారిని పట్టుకుని విచారణ చేపట్టగా వారినుంచి సరైన వివరణ రానిపక్షంలోనే ఈ నగధును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. గల్ఫ్ దేశాల నుంచి అధిక మొత్తాలలో ఈ సొమ్ము ఇక్కడికి వచ్చి చేరుతుందని అభిప్రాయపడ్డారు. మలప్పురం, పలక్కాడ్ ప్రాంతాల్లోనే ఈ హవాలా సొమ్మును అధిక మొత్తాల్లో సీజ్ చేసినట్లు చెప్పారు. అరెస్ట్ చేసిన వారిని విచారణ చేస్తున్నట్లు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ తెలిపారు.