సాక్షి, హైదరాబాద్/దుండిగల్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వర్సెస్ ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఎపిసోడ్‌లో బోయిన్‌పల్లి ఠాణాకు చేరిన ల్యాప్‌టాప్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. గురువారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాల మధ్య పోలీసుస్టేషన్ వద్ద లభించిన ల్యాప్‌టాప్‌ను పోలీసులు తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అది రత్నాకర్‌దన్న ఉద్దేశంతో ఐటీ అధికారులకు చూపించినా వారు నోరు మెదపకపోవడంతో కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్‌ఎస్‌ఎల్) పంపాలని యోచిస్తున్నారు.
మల్లారెడ్డి సహా ఆయన కుటుంబీకులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పంచనామాపై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డితో అధికారులు సంతకం చేయించుకోవడంతో వివాదం మొదలైంది. దీనిపై మల్లారెడ్డి గురువారం రాత్రి బోయిన్‌పల్లి ఠాణాలో రత్నాకర్‌పై ఫిర్యాదు చేశారు. రెండు గంటల తర్వాత రత్నాకర్ కూడా అదే పీఎస్‌లో మరో ఫిర్యాదు ఇచ్చారు. ఆస్ప త్రి వద్ద తనను అడ్డుకున్న మల్లారెడ్డి తదితరులు ల్యాప్‌టాప్ లాక్కున్నారని అందులో పేర్కొన్నారు.
ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపే యోచనలో పోలీసులు
మల్లారెడ్డి, రత్నాకర్ ఫిర్యాదులతో నమోదైన కేసులను దుండిగల్ ఠాణాకు బదిలీ చేసినా ల్యాప్‌టాప్ మాత్రం బోయిన్‌పల్లి ఠాణాలోనే ఉండిపోయింది. అది ఐటీ అధికారి రత్నాకర్ వ్యక్తిగత ల్యాప్‌టాప్‌గా భావిస్తున్నప్పటికీ ఆయన సహా ఎవరూ ధ్రువీకరించట్లేదు. తొలుత అది ఎక్కడ నుంచి? ఎలా వచ్చిందో తేలిస్తేనే మిగతా విషయాలు చెప్తామంటూ ఐటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తామే ఆ ల్యాప్‌టాప్ ఆన్ చేసి ఎవరిదో చూద్దామని పోలీసులు మొదట భావించినా.. అలా చేస్తే డేటాకు సంబంధించిన వివాదం తలెత్తే ప్రమాదం ఉందని మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతితో సదరు ల్యాప్‌టాప్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపి తెరిపించాలని యోచిస్తున్నారు. సమీప సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలిస్తున్నామని, కానీ ల్యాప్‌టాప్‌ను అక్కడ ఎవరు పెట్టారనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదని బోయిన్‌పల్లి పోలీసులు చెప్పారు. కాగా, మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారి రత్నాకర్ ఫిర్యాదులకు సంబంధించిన రెండు కేసులు దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యాయి. దీంతో ఇక్కడ కేసులు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రాత్రంతా నాటకీయ పరిణామాలు
రెండు ఫిర్యాదులు పోలీసుల వద్ద ఉండగానే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పటికే బోయిన్‌పల్లి ఠాణా కేంద్ర బలగాల అ«దీనంలోకి వెళ్లిపోయింది. ఆ సందర్భంలో కొందరు వ్యక్తులు కారులో వచ్చి ఓల్యాప్‌టాప్‌ను ఠాణాలో అప్పగించాలని చూశారు. అది సాధ్యం కాకపోవడంతో వాళ్లు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మరో యువకుడు ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చాడు. అప్పటికే ఠాణా గేట్లకు తాళాలు పడ్డాయి. సదరు యువకుడు ల్యాప్‌టాప్‌ను పోలీసులకు ఇవ్వాలని ప్రయత్నించాడు. వారు విముఖత చూపడంతో గేటు వద్ద పెట్టేసి వెళ్లిపోయాడు.
ఈ తతంగం మొత్తం ఐటీ అధికారులు తమ ఫోన్లలో రికార్డు చేశారు. రోడ్డుపై వదిలేసిన ల్యాప్‌టాప్‌ను ఠాణాలోకి తీసుకువెళ్లిన పోలీసులు దాన్ని ఐటీ అధికారులకు చూపించారు. అది ఎవరిదన్న విష యం పక్కన పెట్టాలని, అసలు ఠాణాకు ఎలా వచి్చందో తేల్చాలని ఐటీ అధికారులు పట్టుబట్టారు. దీంతో పంచనామా నిర్వహించిన పోలీ సులు ల్యాప్‌టాప్‌ను ఠాణాలో భద్రపరిచారు.
ఇదీ చదవండి: ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి
Comments
Please login to add a commentAdd a comment