‘ఆడారి’ నివాసంలో కొనసాగుతున్న ఐటీ రైడ్స్
విశాఖ : విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు నివాసంపై ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు మూడోరోజు కూడా అడారి తులసీరావు ఇంటితో పాటు కార్యాలయాల్లోనూ సోదాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా విశాఖ డైయిరీ కార్యాలయంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. డెయిరీలోకి ఇతరులను అధికారులు అనుమతించడం లేదు.
అలాగే విశాఖ డైయిరీ చైర్మన్ కుమార్తె, కుమారుడి ఆస్తులపైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే ఆయన కుమార్తె యలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇళ్లపై మంగళవారం ఆదాయపన్ను (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. పలుమార్లు రమాకుమారిని పట్టణంలోని ఆంధ్రాబ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లను తెరిపించి తనిఖీలు చేపట్టారు. లాకర్లలో గల బంగారు నగలపై ప్రశ్నించగా గ్రామదేవతల నగలను లాకర్లలో ఉంచినట్టు చెప్పారని సమాచారం.
మరోవైపు విశాఖ డెయిరీ సంస్థలపై ఆదాయ పన్నుశాఖ అధికారుల దాడులు డైరక్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. చైర్మన్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయంటూ ప్రచార సాధనాల ద్వారా తెలుసుకున్న విశాఖ డెయిరీ డైరక్టర్లు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. డెయిరీ చైర్మన్‌కు బినామీలుగా కొందరు డైరక్టర్లు ఉన్నట్టు, ఆ కోణంలో కూడా అధికారులు కూపీ లాగుతున్నట్టు తెలిసింది. డైరక్టర్ల ఆస్తులు, వారి ఆదాయ వనరులపైనా ఆరా తీస్తున్నట్టు సమాచారం.