Chamakura Mallreddy
-
మల్లారెడ్డి వర్సెస్ ఐటీ శాఖ.. కంచికి చేరని ల్యాప్‌టాప్ కథ!
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వర్సెస్ ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఎపిసోడ్లో బోయిన్పల్లి ఠాణాకు చేరిన ల్యాప్‌టాప్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. గురువారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాల మధ్య పోలీసుస్టేషన్ వద్ద లభించిన ల్యాప్‌టాప్‌ను పోలీసులు తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అది రత్నాకర్దన్న ఉద్దేశంతో ఐటీ అధికారులకు చూపించినా వారు నోరు మెదపకపోవడంతో కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపాలని యోచిస్తున్నారు. మల్లారెడ్డి సహా ఆయన కుటుంబీకులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పంచనామాపై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డితో అధికారులు సంతకం చేయించుకోవడంతో వివాదం మొదలైంది. దీనిపై మల్లారెడ్డి గురువారం రాత్రి బోయిన్పల్లి ఠాణాలో రత్నాకర్‌పై ఫిర్యాదు చేశారు. రెండు గంటల తర్వాత రత్నాకర్ కూడా అదే పీఎస్‌లో మరో ఫిర్యాదు ఇచ్చారు. ఆస్ప త్రి వద్ద తనను అడ్డుకున్న మల్లారెడ్డి తదితరులు ల్యాప్‌టాప్ లాక్కున్నారని అందులో పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎల్కు పంపే యోచనలో పోలీసులు మల్లారెడ్డి, రత్నాకర్ ఫిర్యాదులతో నమోదైన కేసులను దుండిగల్ ఠాణాకు బదిలీ చేసినా ల్యాప్‌టాప్ మాత్రం బోయిన్పల్లి ఠాణాలోనే ఉండిపోయింది. అది ఐటీ అధికారి రత్నాకర్ వ్యక్తిగత ల్యాప్‌టాప్‌గా భావిస్తున్నప్పటికీ ఆయన సహా ఎవరూ ధ్రువీకరించట్లేదు. తొలుత అది ఎక్కడ నుంచి? ఎలా వచ్చిందో తేలిస్తేనే మిగతా విషయాలు చెప్తామంటూ ఐటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తామే ఆ ల్యాప్‌టాప్ ఆన్ చేసి ఎవరిదో చూద్దామని పోలీసులు మొదట భావించినా.. అలా చేస్తే డేటాకు సంబంధించిన వివాదం తలెత్తే ప్రమాదం ఉందని మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతితో సదరు ల్యాప్‌టాప్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపి తెరిపించాలని యోచిస్తున్నారు. సమీప సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలిస్తున్నామని, కానీ ల్యాప్‌టాప్‌ను అక్కడ ఎవరు పెట్టారనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదని బోయిన్పల్లి పోలీసులు చెప్పారు. కాగా, మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారి రత్నాకర్ ఫిర్యాదులకు సంబంధించిన రెండు కేసులు దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యాయి. దీంతో ఇక్కడ కేసులు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాత్రంతా నాటకీయ పరిణామాలు రెండు ఫిర్యాదులు పోలీసుల వద్ద ఉండగానే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పటికే బోయిన్పల్లి ఠాణా కేంద్ర బలగాల అ«దీనంలోకి వెళ్లిపోయింది. ఆ సందర్భంలో కొందరు వ్యక్తులు కారులో వచ్చి ఓల్యాప్టాప్ను ఠాణాలో అప్పగించాలని చూశారు. అది సాధ్యం కాకపోవడంతో వాళ్లు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మరో యువకుడు ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చాడు. అప్పటికే ఠాణా గేట్లకు తాళాలు పడ్డాయి. సదరు యువకుడు ల్యాప్‌టాప్‌ను పోలీసులకు ఇవ్వాలని ప్రయత్నించాడు. వారు విముఖత చూపడంతో గేటు వద్ద పెట్టేసి వెళ్లిపోయాడు. ఈ తతంగం మొత్తం ఐటీ అధికారులు తమ ఫోన్లలో రికార్డు చేశారు. రోడ్డుపై వదిలేసిన ల్యాప్‌టాప్‌ను ఠాణాలోకి తీసుకువెళ్లిన పోలీసులు దాన్ని ఐటీ అధికారులకు చూపించారు. అది ఎవరిదన్న విష యం పక్కన పెట్టాలని, అసలు ఠాణాకు ఎలా వచి్చందో తేల్చాలని ఐటీ అధికారులు పట్టుబట్టారు. దీంతో పంచనామా నిర్వహించిన పోలీ సులు ల్యాప్‌టాప్‌ను ఠాణాలో భద్రపరిచారు. ఇదీ చదవండి: ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి -
టీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం
మహేశ్వరం: మహేశ్వరం జెడ్పీటీసీ అభ్యర్థి తీగల అనితారెడ్డి గెలిచి జెడ్పీ పీఠాన్ని అధిష్టించడం ఖాయమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి ఆయన మండల పరిధిలోని హర్షగూడ, మన్సాన్పల్లి, మహేశ్వరం గ్రామాల్లో అనితారెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేస్తే ఏం ప్రయోజనం లేదని తెలిపారు. గెలిచే అభ్యర్థులకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. మహేశ్వరం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న తీగల అనితారెడ్డి గెలిచి జెడ్పీ పీఠం అధిష్టించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతమని, అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతులకు పంట పెట్టుబడి కింద సాయం, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అందిస్తున్నట్లు వివరించారు. మిషన్ భగీరథలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇప్పించి తాగునీటిని అందిస్తూ ఆడపడుచుల కష్టాలను దూరం చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. తాను కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. మంత్రి కోటా కింద మండలానికి అధిక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తన బిడ్డ అనితారెడ్డిని జెడ్పీటీసీగా గెలిపించి జెడ్పీచైర్‌పర్సన్ చేయాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందన్నారు. టీఆర్ఎస్ హవాను ఆపే శక్తి ఎవరికీ లేదు అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ గాలిని అపేశక్తి ఎవరికి లేదన్నారు. ఆరునూరైన మహేశ్వరంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. అంతకు ముందు గ్రామాల్లో ప్రచారం చేశారు. హర్షగూడలో గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా పోతరాజుల నృత్యాలు అలరించాయి. మహిళలు బోనాలతో మంత్రి, జెడ్పీటీసీ అభ్యర్థికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొత్త మనోహర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, హర్షగూడ, మన్సాన్పల్లి, మహేశ్వరం ఎంపీటీసీ అభ్యర్థులు విజయ్‌కుమార్ నాయక్, రఘుమారెడ్డి, నవీన్, లక్ష్మమ్మ, అంధ్య నాయక్, నాయకులు కూన యాదయ్య, అంబయ్య యాదవ్, పాండు నాయక్, చంద్రయ్య, రవినాయక్, రమేష్, జాన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
మల్కాజ్గిరి.. మామకు సవాల్ !
సాక్షి,సిటీబ్యూరో : ఎన్నో విశేషాలున్న మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ విజయం ప్రధాన పార్టీలన్నింటికీ అతిముఖ్యం కావటంతో ఎవరికి వారే వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో వెళుతున్నారు. ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున మంత్రి మల్లారెడ్డి అల్లుడు, యువ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయ కుడు ఎ.రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామ చంద్‌రావులు బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి టికెట్ కోసం టీఆర్ఎస్లో తీవ్ర పోటీ ఉన్నా.. రాజకీయ సమీకరణాల్లో మర్రి రాజశేఖర్‌రెడ్డిని ఎంపిక చేసిన అధిష్టానం.. గెలుపు బాధ్యతను మాత్రం మంత్రి మల్లారెడ్డిపైనే మోపింది. మల్లారెడ్డి ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేసిన రెండు ఎన్నికల్లో అల్లుడు రాజశేఖర్‌రెడ్డి గెలుపు బాధ్యతను భుజాన వేసుకుంటే.. ఈ ఎన్నికలో మాత్రం అల్లుడి కోసం మామ అన్నీ తానై వ్యవహరించాల్సి వస్తోంది. నియోజకవర్గంపై పూర్తి పట్టున్న మల్లారెడ్డి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశాలు పూర్తి చేశారు. మంగళవారం నుంచి నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. రాజశేఖర్‌రెడ్డి విజయం మంత్రి మల్లారెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకం కావటంతో మామ సవాలుగా తీసుకుని ముందుకు వెళుతున్నారు. ఐదేళ్లలో ఎంతో తేడా.. 2014 ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో ఇక్కడ విజయం సాధించిన టీడీపీ.. తాజా ఎన్నికలకు వచ్చేసరికి పోటీలోనే లేకుండా పోయింది. ఇక బీజేపీ, జనసేనలు స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి. ఈసారి ఎవరికి వారే పోటీకి దిగారు. గడిచిన ఎన్నికల్లో మాజీ ఐఏఎస్ అధికారి లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ, మా జీ డీజీపీ దినేష్‌రెడ్డిలు ఇక్కడి నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొదటిసారే లోక్‌సభకు.. ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చామకూర మల్లారెడ్డి తన తొలి ప్రయత్నంలోనే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఆపై టీఆర్ఎస్లో చేరిన మల్లారెడ్డి.. పదవికి రాజీనామా చేసి శాసనసభకు అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. తొలిసారే లోక్‌సభపై గురి రాజశేఖర్‌రెడ్డి రాజకీయాలకు కొత్త. మామ మల్లారెడ్డి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలో తెర వెనక నుంచి అల్లుడు మంత్రాంగమంతా నడిపారు. మేడ్చల్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో రాజశేఖర్‌రెడ్డికి విస్తృత సంబంధాలున్నాయి. తన గెలుపు బాధ్యతను మల్లారెడ్డితో పాటు బంధువులపై ఉంచి తాను ప్రజలతో మమేకం కానున్నారు. -
నాడు ఇంద్రారెడ్డి.. నేడు మల్లారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాకు మరోసారి కార్మికశాఖ లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహించగా.. తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలో బెర్త్ దక్కించుకున్న చామకూర మల్లారెడ్డిని అదే శాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వరించింది. మేడ్చల్ శాసనసభ్యుడిగా తొలిసారి విజయం సాధించిన మల్లారెడ్డి మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రమాణస్వీకారం చేశారు. 2014లో మల్కాజిగిరి ఎంపీగా టీడీపీ తరఫున గెలుపొందిన మల్లారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా బరిలో దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో చామకూరకు అవకాశం కల్పిం చారు. మృదుస్వభావి, హాస్యచతురుడైన మల్లారెడ్డికి ఆమాత్య హోదా కట్టబెట్టడం సమంజసమని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. గ్రేటర్ పరిధిలో బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకొని చామకూరకు చాన్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. నాడు ఇంద్రారెడ్డి.. నేడు మల్లారెడ్డి తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్న మల్లారెడ్డికి కార్మికశాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖను కేటాయిస్తూ మంగళవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ శాఖను మన జిల్లా నుంచి ఇంద్రారెడ్డి నిర్వర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు మల్లారెడ్డికి ఈ పోర్టుపొలియో లభించింది. గత ప్రభుత్వ హయాంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన మహేందర్‌రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో అదే శాఖను మల్లారెడ్డికి కట్టబెడుతారనే ప్రచారం జరిగింది. అదేసమయంలో ఆయన వ్యవహారశైలిని అంచనా వేసిన విశ్లేషకులు.. ఆయనకు క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖలు దక్కుతాయని అంచనా వేశారు. అయితే, పరిశీలకుల ఊహలకందని విధంగా కార్మిక శాఖను సీఎం అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, మంత్రి కావాలనే చిరకాల వాంఛ నెరవేరడంతో మల్లారెడ్డి ఆనందంలో మునిగిపోయారు. అమాత్య పదవిపై కన్నేసిన ఆయన ఎంపీ పదవిని కాదని ఎమ్మెల్యేగా పోటీచేయడం.. విజయం సాధించడం.. మంత్రి పదవిని దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇదిలావుండగా, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మేడ్చల్, పరిసర కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు భారీగా ఉండడం.. కార్మికులు కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ పనిచేస్తుండడం ఆయన పనితీరును ప్రభావితం చేయనుంది. శుభాకాంక్షలు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చామకూర మల్లారెడ్డికి జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులతో కలిసి బోయిన్‌పల్లిలోని మంత్రి నివాసానికి వెళ్లారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం మల్లారెడ్డికి పూల మొక్కను బహూకరించారు. ఆమెతో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సంజీవ్‌రెడ్డి, శైలజ, రమాదేవి తదితరులు ఉన్నారు. -
'మహేష్ బాబు అంటే ఇష్టం'
హైదరాబాద్: 'ప్రిన్స్' మహేష్ బాబుకు అమ్మాయిలే కాదు రాజకీయ నాయకులు అభిమానులుగా మారిపోతున్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్‌గిరికి ప్రాతినిథ్యం వహిస్తున్న చామకూర మల్లారెడ్డి- మహేష్ ఫ్యాన్ అట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మహేష్‌బాబు తన అభిమాన నటుడని మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. మహేష్ సినిమాలంటే చాలా ఇష్టమని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక హిందీలో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ తన అభిమాన నటీనటులని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు పిల్లలతో కలిసి ప్రతి ఆదివారం సినిమాకు వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. 61 ఏళ్ల మల్లారెడ్డి తొలి ప్రయత్నంలోనే అతిపెద్ద నియోజకవర్గానికి ఎంపీ అయ్యారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)