హర్షగూడలో మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి
మహేశ్వరం: మహేశ్వరం జెడ్పీటీసీ అభ్యర్థి తీగల అనితారెడ్డి గెలిచి జెడ్పీ పీఠాన్ని అధిష్టించడం ఖాయమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి ఆయన మండల పరిధిలోని హర్షగూడ, మన్సాన్‌పల్లి, మహేశ్వరం గ్రామాల్లో అనితారెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేస్తే ఏం ప్రయోజనం లేదని తెలిపారు. గెలిచే అభ్యర్థులకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు.
మహేశ్వరం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న తీగల అనితారెడ్డి గెలిచి జెడ్పీ పీఠం అధిష్టించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతమని, అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతులకు పంట పెట్టుబడి కింద సాయం, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అందిస్తున్నట్లు వివరించారు. మిషన్ భగీరథలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇప్పించి తాగునీటిని అందిస్తూ ఆడపడుచుల కష్టాలను దూరం చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. తాను కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. మంత్రి కోటా కింద మండలానికి అధిక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తన బిడ్డ అనితారెడ్డిని జెడ్పీటీసీగా గెలిపించి జెడ్పీచైర్‌పర్సన్ చేయాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందన్నారు.
టీఆర్‌ఎస్ హవాను ఆపే శక్తి ఎవరికీ లేదు
అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ గాలిని అపేశక్తి ఎవరికి లేదన్నారు. ఆరునూరైన మహేశ్వరంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. అంతకు ముందు గ్రామాల్లో ప్రచారం చేశారు. హర్షగూడలో గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా పోతరాజుల నృత్యాలు అలరించాయి. మహిళలు బోనాలతో మంత్రి, జెడ్పీటీసీ అభ్యర్థికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కొత్త మనోహర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, హర్షగూడ, మన్సాన్‌పల్లి, మహేశ్వరం ఎంపీటీసీ అభ్యర్థులు విజయ్‌కుమార్ నాయక్, రఘుమారెడ్డి, నవీన్, లక్ష్మమ్మ, అంధ్య నాయక్, నాయకులు కూన యాదయ్య, అంబయ్య యాదవ్, పాండు నాయక్, చంద్రయ్య, రవినాయక్, రమేష్, జాన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment