రూ.33,500 కోట్లు
రానున్న ఏడేళ్లలో బాల్య వివాహాలు, కౌమార దశ ప్రసవాలకు అడ్డుకట్ట వేస్తే ఆదా అయ్యే మొత్తం
- దేశంలో భారీగా తగ్గనున్న ఆరోగ్య సంబంధిత ఖర్చులు
- ప్రపంచ బ్యాంకు, ఐసీఆర్‌డబ్ల్యూ సర్వేలో వెల్లడి
దేశంలో రానున్న ఏడేళ్లలో బాల్య వివాహాలు.. కౌమార దశలోనే ప్రసవాలకు అడ్డుకట్టవేస్తే.. ఆరోగ్యం దానికి సంబంధించిన ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చట. వీటిని నియంత్రిస్తే ఆదా అయ్యే మొత్తం రూ.33,500 కోట్లకు పైనేనట. ఈ మొత్తం 2017–18 కేంద్ర బడ్జెట్‌లో ఉన్నత విద్యకు కేటాయించిన నిధుల(రూ.33,329 కోట్లు)తో సమానం. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ పరిశోధక సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్(ఐసీఆర్‌డబ్ల్యూ) తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో బాల్య వివాహాలను.. కౌమార దశలోనే శిశు జననాలను నియంత్రించడం వల్ల రూ.1.14 లక్షల కోట్లు ఆదా అవుతాయని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇందులో భారత్ నుంచి ఆదా అయ్యే మొత్తం సుమారు రూ.65,000 కోట్లు(62 శాతం) అని పేర్కొంది.
–సాక్షి, తెలంగాణ డెస్క్
బడ్జెట్‌పైనా తగ్గనున్న ఒత్తిడి
బాల్య వివాహాలను, కౌమార దశ ప్రసవాలను అడ్డుకోగలిగితే.. జనాభా వృద్ధి రేటు తగ్గుతుందని, తద్వారా ప్రభుత్వ బడ్జెట్లపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషించింది. మొత్తంగా 106 దేశాల్లో బాల్య వివాహాలను తగ్గించడం వల్ల 2030 నాటికి ఏటా రూ.37 లక్షల కోట్లు ఆదా అవుతాయని వెల్లడించింది. 2015లో దేశంలో సుమారు 1.7 కోట్ల మంది చిన్నారులకు 10 నుంచి 19 ఏళ్ల మధ్య వివాహాలు జరుగుతున్నాయి. వీరు 60 లక్షల మంది శిశువులకు జన్మనిచ్చారు. ప్రస్తుతం దేశంలో వివాహాలు జరుగుతున్న వారిలో ఇది 47 శాతం కావడం గమనార్హం. ఇలా చిన్న వయసులోనే జరుగుతున్న పెళ్లిళ్లలో 76 శాతం లేదా 1.27 కోట్ల మంది బాలికలవే. 2016లో 15–19 ఏళ్ల వయసులో పెళ్లిళ్లు చేసుకున్న సుమారు 2,80,000 మంది బాలికలు.. ఇప్పటికే నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. 2001తో పోలిస్తే ఇది 65 శాతం పెరిగింది.
మెరుగైన చర్యతో సత్ఫలితాలు
ఆర్థిక కారణాల వల్లే బాల్య వివాహాలు, కౌమార దశ ప్రసవాలు ఎక్కువ జరుగుతున్నాయని, వీటిని అధిగమించేందుకు భారత్‌తో పాటు ఇతర దేశాలు మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు–ఐసీఆర్‌డబ్ల్యూ సర్వే పేర్కొంది. బాల్య వివాహాలను, కౌమార దశ ప్రసవాలను అడ్డుకోవడం మొదలుపెట్టిన తొలినాళ్లలో పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఎటువంటి మార్పూ ఉండదని, అయితే ఆ తర్వాత నుంచి పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని, దీని వల్ల విద్యా రంగంలోనూ నిధులు ఆదా అవుతాయని వివరించింది.
