వేలానికి సీఎం వాచీ ?
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన రూ.70 లక్షల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ వాచ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతానని చెప్పుకునే సిద్ధరామయ్య ఇంత ఖరీదు చేసే వాచ్‌ను ఎలా కొన్నారు? ఒక వేళ ఆయన కొనకపోతే ఎవరైనా బహుమతిగా ఇచ్చారా? బహుమతిగా అందుకొని ఉంటే అందుకు ప్రతిఫలంగా సిద్దరామయ్య ఏం చేశారు? అంటూ మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సంధించిన ప్రశ్నలు కలకలాన్ని రేపాయి. ఇక ఈ వాచ్ వ్యవహారం ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లింది.
వాచ్ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌ను ఆదేశించింది. ఇలాంటి సందర్భంలో ఈ వివాదం నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని సీఎం సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు గాను తన లగ్జరీ వాచ్‌ను వేలం వే యాలని, తద్వారా వచ్చిన మొత్తాన్ని ముఖ్యమంత్రి పరిహార నిధికి అందజేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అంతకంటే ముందుగా ఈ వాచ్‌ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అందజేసిన వ్యక్తిగా చెబుతున్న ఆత్మీయ వైద్యుడితోనే ‘నేనే ఆ వాచ్‌ను సిద్ధరామయ్యకు బహూకరించాను’ అని చెప్పడంతో పాటు ఆ హ్యూబ్లోట్ లగ్జరీ వాచ్ కొన్నప్పటి రసీదును కూడా మీడియా ముందుంచే దిశగా సిద్ధరామయ్య ఆలోచిస్తున్నట్లు సమాచారం.