
ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన నిర్ణయం
లక్నో: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆలయాలను సందర్శించడం మామూలే. కానీ ఈసారి ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. మసీదును సందర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. లక్నోలో కొత్తగా నిర్మించిన మసీదుకు ఆయన వెళ్లనున్నారు. ఆల్ ఇండియా ముస్లిం వుమన్ లా బోర్డ్(ఏఐఎంపీడబ్ల్యూ ఎల్బీ) చైర్ పర్సన్ షైస్తా అంబర్ ఆహ్వానం మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
మోహన్ లాల్ గంజ్ లోని మాధో ఆశ్రమంలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన భాగవత్ ను అంబర్ కలిశారు. 'మాధో ఆశ్రమానికి సమీపంలో నేను నిర్మించిన మసీదును సందర్శించాలని భాగవత్ ను ఆహ్వానించాను. ఈసారి లక్నో వచ్చినప్పుడు మసీదుకు వస్తానని ఆయన నాకు హామీయిచ్చార'ని అంబర్ తెలిపారు. భాగవత్ మసీదును సందర్శిస్తే ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకమనే భావన సమసిపోతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. జాతి నిర్మాణం, సామాజిక విషయాల గురించి కూడా భాగవత్ తో చర్చించినట్టు చెప్పారు.