యువవాహినిలోకి సమాజ్‌వాదీ గూండాలు!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహిని సంస్థ సభ్యత్వాలను దాదాపు ఏడాది పాటు ఆపేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు హింసాత్మక సంఘటనలలో ఆ సంస్థ పాత్ర ఉందన్న ఆరోపణలు రావడమే అందుకు కారణం. అయితే.. యువవాహిని సభ్యులు క్రమశిక్షణ కలిగినవాళ్లని, వాళ్లు ఎప్పుడూ అలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడరని సంస్థ ప్రధాన కార్యదర్శి, యోగి ఆదిత్యనాథ్‌కు సన్నిహిత సహచరుడు అయిన పీకే మాల్ తెలిపారు. కాషాయ రంగులో ఉండే కండువాలను ధరించిన సమాజ్‌వాదీ పార్టీ గూండాలు సంస్థ సభ్యుల బృందాల్లోకి చొరబడి హింసకు పాల్పడుతున్నారని, అందువల్ల అలాంటి వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తమ సభ్యులకు చెప్పామని ఆయన అన్నారు. ఇలాంటి నకిలీ సభ్యులను ఏరిపారేయడానికి వీలుగా ఒక ఏడాది పాటు సభ్యత్వాన్ని ఆపేస్తున్నామని వివరించారు. గోరక్ష, లవ్ జీహాద్‌ల పేర్లతో ఇటీవలి కాలంలో యూపీలో దాడులు పెరిగిపోవడం, దానికి హిందూ యువవాహిని మీద ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
బులంద్‌షహర్ కేసులో అరెస్టయిన వాళ్లు మాత్రం తమ సభ్యులేనని, అయితే వాళ్లమీద పెట్టినవి మాత్రం బూటకపు కేసులని మాల్ చెప్పారు. తన బంధువు మరో వర్గానికి చెందిన మహిళను తీసుకుని పారిపోడానికి సాయం చేశాడన్న కారణంతో 60 ఏళ్ల ముస్లింను కొంతమంది బులంద్‌షహర్‌లో కొట్టి చంపేశారు. నేరచరిత్ర గలవాళ్లు సంస్థలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని తమకు తరచు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటించి, సమావేశాలు నిర్వహించి ఇలా చొరబడినవాళ్లను ఏరిపారేస్తామన్నారు. హిందూ యువవాహిని సభ్యులు ప్రభుత్వ పథకాలను పేదలకు అందేలా చూడాలి తప్ప, సొంత ఎజెండాలు పెట్టుకోకూడదన్నది యోగి ఆదిత్యనాథ్ సందేశమని, ఎవరైనా అలా హింసకు పాల్పడితే ఊరుకునేది లేదని మాల్ స్పష్టం చేశారు.