Hindu Yuva Vahini
-
యూపీలో యోగికి షాక్
లక్నో: యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా అయ్యేంతవరకు ఆయనకు కుడిభుజంగా ఉన్న హిందూ యువ వాహిని (హెచ్‌వైవీ) మాజీ అధ్యక్షుడు సునీల్ సింగ్ శనివారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆపార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ సమక్షంలో పార్టీలో చేరారు. సునీల్‌ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 2017లో హిందూ యువ వాహిని నుంచి బహిష్కరించడంతో అప్పట్నుంచి వేరే సంస్థను నెలకొల్పి దానికి జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. యోగి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, ఇక ఆ ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నేతలపై యోగి సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకొచ్చాక హిందూ ముస్లిం వర్గ విభేదాలను ప్రోత్సహిస్తోందన్నారు. -
ఆదిత్యయోగి యువ వాహిణి రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 15 ఏళ్లపాటు మతోన్మాద రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన హిందూ యువ వాహిణి రద్దువుతోంది. ఇప్పటికే లక్నో సహా పలు జిల్లా యూనిట్లు రద్దయ్యాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి 2002లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఆయన రాజకీయంగా రాణించడానికి ఎంతో ఉపయోగపడింది. 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిత్యనాథ్ యోగి ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, అదే 2004 ఎన్నికల్లో 1.42 లక్షల ఓట్లు మెజారిటీతో, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో మూడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించడానికి ఈ సంస్థ ఎంతో దోహద పడింది. యోగి యూపీ ముఖ్యమంత్రిగా ఖరారయినప్పటి నుంచి ఈ హిందూ యువ వాహిణి సంస్థ మరింత బలపడుతూ వచ్చింది. ఇప్పుడు అర్థంతరంగా రద్దవడానికి కారణం ఆరెస్సెస్ అని తెల్సింది. మహారాష్ట్రలో శివసేన స్వతంత్య్రంగా ఎదిగినట్లుగా మున్ముందు హిందూ యువ వాహిణి బీజేపీ, ఆరెస్సెస్‌లకు సమాంతరంగా ఎదిగే రాజకీయంగా తమకే ముప్పు తెచ్చే అవకాశం ఉందని గ్రహించే ఆరెస్సెస్, బీజేపీ అధిష్టానం ఈ సంస్థ మొత్తాన్ని రద్దు చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెల్సింది. అయితే జిల్లా యూనిట్ల వారిగా దీన్ని రద్దు చేస్తూ వస్తున్నారు. యువ వాహిణి లక్నో యూనిట్‌ను గత డిసెంబర్ 8వ తేదీన యువ వాహిణి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీకే మాల్ ప్రకటించగానే సంస్థకు దాదాపు 2,500 మంది యువకులు రాజీనామా చేసి వెళ్లారని లక్నో యూనిట్ ఇంచార్జి అనుభవ్ శుక్లా తెలిపారు. మరో పది రోజులకు అంటే డిసెంబర్ 17వ తేదీన శామ్లీ జిల్లా నుంచి వంద మంది, ఆ తర్వాత ఫిబ్రవరి 17వ తేదీన మరో వంద మంది అదే యూనిట్ నుంచి రాజీనామా చేశారని జిల్లా యూనిట్ అధ్యక్షుడు కుల్దీప్ గౌడ్ తెలిపారు. యువ వాహిణికి రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది సమాజ్‌వాది పార్టీలో చేరుతున్నారు. యువ వాహిణీ సభ్యత్వాన్ని ఏడాది పాటు స్తంభింప జేశామని రాష్ట్ర నాయకుడు పీకే మాల్ మీడియాకు తెలిపారు. తమ సంస్థకు రాజకీయాలతో సంబంధం లేదని, ప్రధానంగా సాంస్కృత పరమైన సంస్థని ఆయన అన్నారు. అంతకుమించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. -
క్రిస్మస్ వేడుకలు వద్దు: స్కూళ్లకు వార్నింగ్
లక్నో: పాఠశాల ప్రాంగణాల్లో క్రిస్మస్ సంబరాలు జరపొద్దని ఉత్తరప్రదేశ్‌లోని క్రిస్టియన్ స్కూళ్లకు హెచ్చరిక జారీ అయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన హిందూ యువవాహిని సంస్థకు అనుబంధంగా ఉన్న హిందూ జాగరణ్ మంచ్ ఈ హెచ్చరిక జారీ చేసింది. అలీగఢ్‌లోని క్రిస్టియన్ స్కూళ్లలో క్రిస్మస్ వేడుకలు జరపొద్దని ఈ సంస్థ హెచ్చరించినట్టు ‘వరల్డ్ ఈజ్ వన్ న్యూస్’ వెల్లడించింది. తమ ఆజ్ఞలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. క్రిస్టియన్ స్కూళ్లలో ఎక్కువ సంఖ్యలో హిందూ విద్యార్థులు చదువుకుంటున్నారని, కిస్మస్ జరుపుకునేందుకు విద్యార్థులను బొమ్మలు, కానుకలు తీసుకురమ్మంటున్నారని హిందూ జాగరణ్ మంచ్ అధ్యక్షుడు సోనూ సవిత తెలిపారు. బహుమానాలు, ఇతర వస్తువులతో హిందూ విద్యార్థులను క్రైస్తవులు ఆకర్షిస్తున్నారని, తర్వాత మతమార్పిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి కార్యకలాపాలు హిందూ విద్యార్థులపై మానసికంగా ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. ఇలాంటి చర్యలను వ్యతిరేకించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి కోరతామన్నారు. -
‘2027 కల్లా ముస్లిం రాజ్యంగా భారత్’
మీరట్ : 2027 కల్లా భారత్‌ను ఇస్లాం రాజ్యంగా మార్చాలని ముస్లింలు యోచిస్తున్నారని హిందూ యువవాహిని ఆరోపణలతో దుమారం చెలరేగింది. ఇందుకోసం కావాలనే భారత్‌లోని ముస్లింలు సంతానాన్ని పెంచుకుంటూపోతున్నారని అంది. ఎక్కువ మంది పిల్లల్ని కంటున్న ముస్లిం వారిని భరిస్తుంది భారత్‌ను అక్రమించుకునేందుకని ఆరోపించింది. ముస్లింలు పిల్లల్ని కనడం తగ్గించకపోతే 2027 కల్లా భారత్ ఇస్లాం రాజ్యంగా మారడం ఖాయమని హిందూ యువవాహిని పశ్చిమ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు నాగేంద్ర ప్రతాప్ తోమర్ వ్యాఖ్యనించారు. ముస్లిం కమ్యూనిటీ ఈ కుట్రకు ప్రధాన సూత్రధారని కూడా ఆరోపించారు. అఖండ భారతావనిని ముస్లింలు తమ పిడికిట పట్టాలని భావిస్తున్నారని అన్నారు. హిందూ యువవాహిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2002లో స్థాపించారు. -
తాజ్‌మహల్ దగ్గర శివపూజ
-
తాజ్‌మహల్ దగ్గర శివపూజ
ఆగ్రా : ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్ చుట్టూ వివాదాల పరంపరకు ఇప్పట్లో ఫుల్స్టాప్ పడేటట్లు కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తాజ్‌మహల్‌ను తొలగించడంతో మొదలైన వివాదం.. రోజుకో కొత్త మలుపు తిరిగుతోంది. తాజాగా.. సోమవారం అతివాద హిందూభావజాలంతో ఉన్న ఇద్దరు యువకులు తాజ్‌మహల్ దగ్గర శివచాలీసా పూజను మొదలు పెట్టారు. అంతేకాక తాజ్‌మహల్ అనేది మొదట శివాలయం అని వారు పేర్కొన్నారు. చారిత్రాత్మక ప్రదేశం వద్ద శివారాధన చేయడంతో అక్కడ కొద్దిసేపు.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శివారాధన చేస్తున్న వారిని అడ్డుకునేందుకు పోలీసలు ప్రయత్నించారు. ఈ సమయంలో వారు.. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తాజ్ దగ్గర శివారాధన చేస్తున్న యువకులను రాష్ట్రీయ స్వాభిమాన్ దళ్ (ఆర్ఎస్డీ), హిందూ యువ వాహిని (హెచ్‌వైవీ)కి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చివరగా సీఐఎస్ఎఫ్ బలగాలు.. వారిని అదుపులోకి తీసుకుని.. స్థానికి పోలీసులకు అప్పంగించారు. రాతపూర్వకంగా క్షమాపణ కోరడంతో.. వారిని పోలీసులు తరువాత విడుదల చేయడం జరిగింది. -
చర్చిలో సీఎం యోగి సేన హల్చల్
భందోహి: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహినికి చెందిన కొందరు.. శుక్రవారం ఓ క్రైస్తవ ప్రార్థనా మందిరం ఎదుట ఆందోళనకు దిగారు. సంత్ రవిదాస్ నగర్ జిల్లా ఔరాయి తాలూకా తియూరి గ్రామంలోని ఓ ఇంటిలో చర్చి నిర్వహిస్తుండగా, యువవాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు. దళితులను బలవంతంగా మతం మార్పిస్తున్నారనేది యువవాహిని ఆరోపణ. విషయం తెలుసుకున్న వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు.. చర్చి పాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేరళకు చెందిన ఆ పాస్టర్‌ను అజ్మన్ అబ్రహామ్‌గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. తియూరి గ్రామంలోని ఆ చర్చిలో కొన్నాళ్లుగా మతమార్పిడులు జరుగుతున్న సంగతి ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని, అందుకే తామే చర్చికి వెళ్లి ఆందోళన చేయాల్సివచ్చిందని యువవాహిని జిల్లా అధ్యక్షుడు సుభాష్ శర్మ మీడియాకు చెప్పారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో ఓంకార్ సింగ్ యాదవ్ తెలిపారు. కాగా, యోగి సీఎం అయిన తర్వాత హిందూ యువవాహిని కార్యకర్తలు చర్చిల ముందు ఆందోళన నిర్వహించడం ఇది రెండోసారి. గత నెలలో మహారాజ్‌గంజ్‌లోని ఓ చర్చి వద్ద ప్రార్థనలను చేసుకుంటున్న 150 మందిని చెదరగొట్టారు. ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుండగానే, నేడు అలాంటిదే మరో కేసు నమోదుకావడం గమనార్హం. -
యోగీపై బీజేపీ అసంతృప్తి
► యోగీ యువసేనపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తి లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజకీయల్లో ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఓ సంచలనం. కేవలం రెండు నెలల కాలంలోనే అత్యంత ప్రభావిత వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అంతే కాదు ఆయనకంటూ ప్రత్యేకమైన ఓ యువసేన ఉంది. అదే హిందూ యువ వాహిని. అయితే ప్రస్తుతం ఈ యువ వాహిని పై బీజీపీ అధిస్ఠానం అసంతృప్తిగా ఉంది. ఇది ఆర్ఎస్ఎస్తో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటోంది. అయితే దీనిపై ఆర్ఎస్ఎస్, బీజేపీలు అసంతృప్తిగా ఉన్నాయి. హిందూ వాహిని ఆదిత్యానాథ్ ఆలోచన నుంచి వచ్చింది. గోరక్‌పూర్, ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి దీని ప్రభావం పూర్వాంచల్ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేది. తాజాగా హిందూ వాహిని, యోగి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడం మొదలైంది. ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు ఇందులోచేరడం మెదలైప్పటినుంచి ఆర్ఎస్ఎస్ అసంతృప్తిగా ఉంది. దీనిపై రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య స్పందించారు. వాహిని పేరు ఎత్తకుండా, దానిని గుర్తు చేసేలా పెరుగుతున్న ఇతర యువసేనలను సహించేదిలేదని, పార్టీ పరంగా అన్నీ ప్రాధాన్యతలు మొదట పార్టీకి, కార్యకర్తలకు ఇవ్వాలన్నారు. యోగి నామినేషన్ సమయంలో కూడా ఇలాంటి స్వంతత్ర వాహినులను బీజేపీ నేతలు వ్యతిరేకించారు. హిందూ వాహిని నెమ్మదిగా ఆర్ఎస్ఎస్లో కలుస్తుందని భావించారు. గతంలో రామ మందిర నిర్మాణం కోసం హిందు పరిషత్ చేస్తున్న ఉద్యమంలో కూడా ఆదిత్యానాథ్, ఆయన పూర్వికుడు అవైధ్యానాథ్ ప్రత్యేకంగా గుర్తింపు పోందారు. తాజాగా హిందూ యువ వాహిని భారీ ప్రణాళిక రచింది. ఏడాది పాటు పార్టీలో నియామకాలు ఆపేయాలని భావిస్తోంది. దీనిపై ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. -
యువవాహినిలోకి సమాజ్‌వాదీ గూండాలు!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహిని సంస్థ సభ్యత్వాలను దాదాపు ఏడాది పాటు ఆపేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు హింసాత్మక సంఘటనలలో ఆ సంస్థ పాత్ర ఉందన్న ఆరోపణలు రావడమే అందుకు కారణం. అయితే.. యువవాహిని సభ్యులు క్రమశిక్షణ కలిగినవాళ్లని, వాళ్లు ఎప్పుడూ అలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడరని సంస్థ ప్రధాన కార్యదర్శి, యోగి ఆదిత్యనాథ్‌కు సన్నిహిత సహచరుడు అయిన పీకే మాల్ తెలిపారు. కాషాయ రంగులో ఉండే కండువాలను ధరించిన సమాజ్‌వాదీ పార్టీ గూండాలు సంస్థ సభ్యుల బృందాల్లోకి చొరబడి హింసకు పాల్పడుతున్నారని, అందువల్ల అలాంటి వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తమ సభ్యులకు చెప్పామని ఆయన అన్నారు. ఇలాంటి నకిలీ సభ్యులను ఏరిపారేయడానికి వీలుగా ఒక ఏడాది పాటు సభ్యత్వాన్ని ఆపేస్తున్నామని వివరించారు. గోరక్ష, లవ్ జీహాద్‌ల పేర్లతో ఇటీవలి కాలంలో యూపీలో దాడులు పెరిగిపోవడం, దానికి హిందూ యువవాహిని మీద ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. బులంద్‌షహర్ కేసులో అరెస్టయిన వాళ్లు మాత్రం తమ సభ్యులేనని, అయితే వాళ్లమీద పెట్టినవి మాత్రం బూటకపు కేసులని మాల్ చెప్పారు. తన బంధువు మరో వర్గానికి చెందిన మహిళను తీసుకుని పారిపోడానికి సాయం చేశాడన్న కారణంతో 60 ఏళ్ల ముస్లింను కొంతమంది బులంద్‌షహర్‌లో కొట్టి చంపేశారు. నేరచరిత్ర గలవాళ్లు సంస్థలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని తమకు తరచు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటించి, సమావేశాలు నిర్వహించి ఇలా చొరబడినవాళ్లను ఏరిపారేస్తామన్నారు. హిందూ యువవాహిని సభ్యులు ప్రభుత్వ పథకాలను పేదలకు అందేలా చూడాలి తప్ప, సొంత ఎజెండాలు పెట్టుకోకూడదన్నది యోగి ఆదిత్యనాథ్ సందేశమని, ఎవరైనా అలా హింసకు పాల్పడితే ఊరుకునేది లేదని మాల్ స్పష్టం చేశారు. -
మీ నాన్న పేరేంటి.. ఇక్కడెందుకున్నావ్?
మీరట్: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో హిందూ యువ వాహిని కార్యకర్తలు రెచ్చిపోయారు. శాస్త్రినగర్ ప్రాంతంలో మంగళవారం ఇంట్లోకి చొరబడి ఓ జంటపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో ముస్లిం వ్యక్తిపై దాడి చేశారు. అతడితో పాటు ఉన్న యువతికి ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘మేము ఇంట్లోకి వెళ్లసరికి వీరిద్దరూ రాజీ మార్గంలో కనిపించారు. అద్దెకు తీసుకున్న ఈ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలుస్తోంద’ని హిందూ యువ వాహిని సభ్యుడు నాగేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘నీ పేరేంటి? మీ నాన్న పేరు చెప్పు. ఇక్కడ ఏం చేస్తున్నారు. మీ పేర్లు ఎందుకు వేర్వేరుగా ఉన్నాయి. మత మార్పిడి చేసుకుంటున్నారా?’ అంటూ వారిద్దరినీ హిందూ యువ వాహిని సభ్యులు ప్రశ్నించారు. తర్వాత వీరిని పోలీసులకు అప్పగించారు. అయితే వీరిద్దరూ ముస్లిం మతానికి చెందిన వారని నిర్ధారణ కావడంతో విడిచిపెట్టినట్టు మీరట్ నగర పోలీసు కమిషనర్ అలోక్ ప్రియదర్శిని తర్వాత తెలిపారు. హిందూ యువ వాహిని సంస్థను 2002లో సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థాపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సంస్థకు ఆయన దూరంగా ఉంటున్నారు. -
చర్చిలో ప్రార్థనను అడ్డుకున్న పోలీసులు
మహరాజ్‌గంజ్: మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఓ చర్చి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మహరాజ్‌గంజ్ జిల్లా దథౌలీ ప్రాంతంలో చర్చి పాస్టర్ యోహన్నన్ ఆడమ్ మతమార్పిడులకు పాల్పడుతున్నారని హిందూ యువవాహిని(హెచ్‌వైవీ)ఫిర్యాదు చేయడంతో పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. స్థానిక ఎస్‌హెచ్‌వో ఆనంద్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ, దాదాపు 150 మంది స్థానికులు, 10 మంది అమెరికన్లు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని తెలిపారు. విచారణ జరిపి దోషులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు పాస్టర్ యోహన్నన్ ఆడమ్ మాట్లాడుతూ, మత మార్పిడులు చేస్తున్నామన్న వాదనలు నిరాధారమనీ, తామంతా ప్రార్థనకే హాజరయ్యామని తెలిపారు. హిందూ యువవాహిని అధ్యక్షుడు సునిల్ సింఘాల్ మాట్లాడుతూ, ‘వారు(క్రైస్తవులు) తమ ప్రార్థనల్ని చర్చిల్లోనే నిర్వహించుకోవాలి. లేదా ఇంట్లో చేసుకోవాలి. అంతేకాని బహిరంగ ప్రదేశాల్లో చేసుకోవడం కుదరదు. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లోనే చేసుకుంటామంటే చర్చిలు కూడా సురక్షితంగా ఉండవ’ ని హెచ్చరించారు. గతంలోనూ ఈ సంస్థ సభ్యులు గోరఖ్‌పూర్‌లోని ఫుల్ గాస్పెల్ చర్చిని ధ్వంసం చేశారు. చర్చిలు అమాయకులైన హిందువులకు డబ్బుల్ని ఎరగా చూపి మతమార్పిడుల్ని ప్రోత్సహిస్తున్నాయని హిందూ యువవాహిని నాయకుడు కృష్ణ నందన్ ఆరోపించారు. మరోవైపు అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఈ ఘటనపై స్పందిస్తూ.. తమకు అమెరికన్ పౌరుల క్షేమమే అత్యవశ్యకమని తేల్చిచెప్పారు.