సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 15 ఏళ్లపాటు మతోన్మాద రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన హిందూ యువ వాహిణి రద్దువుతోంది. ఇప్పటికే లక్నో సహా పలు జిల్లా యూనిట్లు రద్దయ్యాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి 2002లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఆయన రాజకీయంగా రాణించడానికి ఎంతో ఉపయోగపడింది. 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిత్యనాథ్ యోగి ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, అదే 2004 ఎన్నికల్లో 1.42 లక్షల ఓట్లు మెజారిటీతో, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో మూడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించడానికి ఈ సంస్థ ఎంతో దోహద పడింది.
యోగి యూపీ ముఖ్యమంత్రిగా ఖరారయినప్పటి నుంచి ఈ హిందూ యువ వాహిణి సంస్థ మరింత బలపడుతూ వచ్చింది. ఇప్పుడు అర్థంతరంగా రద్దవడానికి కారణం ఆరెస్సెస్ అని తెల్సింది. మహారాష్ట్రలో శివసేన స్వతంత్య్రంగా ఎదిగినట్లుగా మున్ముందు హిందూ యువ వాహిణి బీజేపీ, ఆరెస్సెస్‌లకు సమాంతరంగా ఎదిగే రాజకీయంగా తమకే ముప్పు తెచ్చే అవకాశం ఉందని గ్రహించే ఆరెస్సెస్, బీజేపీ అధిష్టానం ఈ సంస్థ మొత్తాన్ని రద్దు చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెల్సింది. అయితే జిల్లా యూనిట్ల వారిగా దీన్ని రద్దు చేస్తూ వస్తున్నారు.
యువ వాహిణి లక్నో యూనిట్‌ను గత డిసెంబర్ 8వ తేదీన యువ వాహిణి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీకే మాల్ ప్రకటించగానే సంస్థకు దాదాపు 2,500 మంది యువకులు రాజీనామా చేసి వెళ్లారని లక్నో యూనిట్ ఇంచార్జి అనుభవ్ శుక్లా తెలిపారు. మరో పది రోజులకు అంటే డిసెంబర్ 17వ తేదీన శామ్లీ జిల్లా నుంచి వంద మంది, ఆ తర్వాత ఫిబ్రవరి 17వ తేదీన మరో వంద మంది అదే యూనిట్ నుంచి రాజీనామా చేశారని జిల్లా యూనిట్ అధ్యక్షుడు కుల్దీప్ గౌడ్ తెలిపారు. యువ వాహిణికి రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది సమాజ్‌వాది పార్టీలో చేరుతున్నారు. యువ వాహిణీ సభ్యత్వాన్ని ఏడాది పాటు స్తంభింప జేశామని రాష్ట్ర నాయకుడు పీకే మాల్ మీడియాకు తెలిపారు. తమ సంస్థకు రాజకీయాలతో సంబంధం లేదని, ప్రధానంగా సాంస్కృత పరమైన సంస్థని ఆయన అన్నారు. అంతకుమించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment