మీ నాన్న పేరేంటి.. ఇక్కడెందుకున్నావ్?
మీరట్: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో హిందూ యువ వాహిని కార్యకర్తలు రెచ్చిపోయారు. శాస్త్రినగర్ ప్రాంతంలో మంగళవారం ఇంట్లోకి చొరబడి ఓ జంటపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో ముస్లిం వ్యక్తిపై దాడి చేశారు. అతడితో పాటు ఉన్న యువతికి ప్రశ్నాస్త్రాలు సంధించారు.
‘మేము ఇంట్లోకి వెళ్లసరికి వీరిద్దరూ రాజీ మార్గంలో కనిపించారు. అద్దెకు తీసుకున్న ఈ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలుస్తోంద’ని హిందూ యువ వాహిని సభ్యుడు నాగేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
‘నీ పేరేంటి? మీ నాన్న పేరు చెప్పు. ఇక్కడ ఏం చేస్తున్నారు. మీ పేర్లు ఎందుకు వేర్వేరుగా ఉన్నాయి. మత మార్పిడి చేసుకుంటున్నారా?’ అంటూ వారిద్దరినీ హిందూ యువ వాహిని సభ్యులు ప్రశ్నించారు. తర్వాత వీరిని పోలీసులకు అప్పగించారు. అయితే వీరిద్దరూ ముస్లిం మతానికి చెందిన వారని నిర్ధారణ కావడంతో విడిచిపెట్టినట్టు మీరట్ నగర పోలీసు కమిషనర్ అలోక్ ప్రియదర్శిని తర్వాత తెలిపారు.
హిందూ యువ వాహిని సంస్థను 2002లో సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థాపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సంస్థకు ఆయన దూరంగా ఉంటున్నారు.