చర్చిలో ప్రార్థనను అడ్డుకున్న పోలీసులు
మహరాజ్‌గంజ్: మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఓ చర్చి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మహరాజ్‌గంజ్ జిల్లా దథౌలీ ప్రాంతంలో చర్చి పాస్టర్ యోహన్నన్ ఆడమ్ మతమార్పిడులకు పాల్పడుతున్నారని హిందూ యువవాహిని(హెచ్‌వైవీ)ఫిర్యాదు చేయడంతో పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. స్థానిక ఎస్‌హెచ్‌వో ఆనంద్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ, దాదాపు 150 మంది స్థానికులు, 10 మంది అమెరికన్లు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని తెలిపారు. విచారణ జరిపి దోషులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు పాస్టర్ యోహన్నన్ ఆడమ్ మాట్లాడుతూ, మత మార్పిడులు చేస్తున్నామన్న వాదనలు నిరాధారమనీ, తామంతా ప్రార్థనకే హాజరయ్యామని తెలిపారు. హిందూ యువవాహిని అధ్యక్షుడు సునిల్ సింఘాల్ మాట్లాడుతూ, ‘వారు(క్రైస్తవులు) తమ ప్రార్థనల్ని చర్చిల్లోనే నిర్వహించుకోవాలి. లేదా ఇంట్లో చేసుకోవాలి. అంతేకాని బహిరంగ ప్రదేశాల్లో చేసుకోవడం కుదరదు. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లోనే చేసుకుంటామంటే చర్చిలు కూడా సురక్షితంగా ఉండవ’ ని హెచ్చరించారు.
గతంలోనూ ఈ సంస్థ సభ్యులు గోరఖ్‌పూర్‌లోని ఫుల్ గాస్పెల్ చర్చిని ధ్వంసం చేశారు. చర్చిలు అమాయకులైన హిందువులకు డబ్బుల్ని ఎరగా చూపి మతమార్పిడుల్ని ప్రోత్సహిస్తున్నాయని హిందూ యువవాహిని నాయకుడు కృష్ణ నందన్ ఆరోపించారు. మరోవైపు అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఈ ఘటనపై స్పందిస్తూ.. తమకు అమెరికన్ పౌరుల క్షేమమే అత్యవశ్యకమని తేల్చిచెప్పారు.