లక్నో: పాఠశాల ప్రాంగణాల్లో క్రిస్మస్ సంబరాలు జరపొద్దని ఉత్తరప్రదేశ్‌లోని క్రిస్టియన్ స్కూళ్లకు హెచ్చరిక జారీ అయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన హిందూ యువవాహిని సంస్థకు అనుబంధంగా ఉన్న హిందూ జాగరణ్ మంచ్ ఈ హెచ్చరిక జారీ చేసింది. అలీగఢ్‌లోని క్రిస్టియన్ స్కూళ్లలో క్రిస్మస్ వేడుకలు జరపొద్దని ఈ సంస్థ హెచ్చరించినట్టు ‘వరల్డ్ ఈజ్ వన్ న్యూస్’ వెల్లడించింది. తమ ఆజ్ఞలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
క్రిస్టియన్ స్కూళ్లలో ఎక్కువ సంఖ్యలో హిందూ విద్యార్థులు చదువుకుంటున్నారని, కిస్మస్ జరుపుకునేందుకు విద్యార్థులను బొమ్మలు, కానుకలు తీసుకురమ్మంటున్నారని హిందూ జాగరణ్ మంచ్ అధ్యక్షుడు సోనూ సవిత తెలిపారు. బహుమానాలు, ఇతర వస్తువులతో హిందూ విద్యార్థులను క్రైస్తవులు ఆకర్షిస్తున్నారని, తర్వాత మతమార్పిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి కార్యకలాపాలు హిందూ విద్యార్థులపై మానసికంగా ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. ఇలాంటి చర్యలను వ్యతిరేకించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి కోరతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment