ఈసారి ఎన్నికల్లో ఎవరి జాతకాలు ఏంటి?
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎవరి జాతకాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని సర్వేలు కొంత ముందుగానే చెబుతున్నాయి. వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో బీజేపీ కంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీకే కొంతవరకు మొగ్గు కనిపిస్తోందట. ఇక యూపీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రశాంత కిషోర్ లాంటి వ్యూహనిపుణులను తెచ్చుకున్నా ఆ పార్టీకి ఏమాత్రం ఫలితాలు రావట. ఏబీపీ న్యూస్- లోక్‌నీతి, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. జూలై 23 నుంచి ఆగస్ట ఏడోతేదీ వరకు ఈ సర్వే జరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. తాము సమాజ్‌వాదీకే ఓటేస్తామని 30 శాతం ఓటర్లు చెప్పారు. రెండు చిన్న పార్టీలతో పొత్తుపెట్టుకున్న బీజేపీకి 27 శాతం మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. దళిత ఉద్యమాలను ఎంత రెచ్చగొట్టినా, బీఎస్పీ మాత్రం 26 శాతం ఓట్లతో మూడో స్థానానికే పరిమితం కానుంది. కాంగ్రెస్ పార్టీకి మహా అయితే 5 శాతం ఓట్లు రావడం ఎక్కువ.
అయితే.. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మాత్రం ఈసారి హంగ్ మాత్రమే వస్తుందని అంటున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి 141-151 స్థానాలు వస్తాయని, బీజేపీ 124-134 సీట్లు, బీఎస్పీ 103-113 సీట్లు, కాంగ్రెస్ 8-14 స్థానాలు మాత్రమే గెలుచుకుంటాయని సర్వే తేల్చిచెప్పింది. 2012 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 11 శాతం ఓట్లు మెరుగుపరుచుకుని బీజేపీ బాగా లాభపడుతుందని అంటున్నారు. కానీ 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే మాత్రం 16 శాతం ఓట్లు తక్కువే వస్తున్నాయి. యాదవ, ముస్లిం వర్గాలలో సమాజ్‌వాదీకి 68, 62 శాతం మద్దతు లభిస్తోందట. బీజేపీకి ఎక్కువగా ఉన్నత వర్గాలతో పాటు ఓబీసీ వర్గాల్లో ఆదరణ బాగుందంటున్నారు.
అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కావాలని 24 శాతం మంది, మాయావతి అయితే బాగుంటుందని మరో 24 శాతం మంది చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ అయితే బెటరని 4 శాతం మంది అన్నారు. ఇక బీజేపీలో కేంద్ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వైపు 7 శాతం, ఆదిత్యానాథ్ వైపు 5 శాతం, వరుణ్ గాంధీ వైపు 3 శాతం ఓటర్లు మొగ్గుచూపారు. ప్రధాని మోదీ పనితీరు బాగుందని 68 శాం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వ పనితీరుపై 63 శాతం సంతృప్తి వ్యక్తమైంది. ప్రధాని మోదీ ఎన్నికల హామీ 'అచ్చే దిన్' అమలు కాలేదని 52 శాతం మంది అన్నారు. యూపీ ఓటర్లకు ప్రధాన సమస్యలు అభివృద్ధి (33%), ధరల పెరుగుదల (18%).