ఫోర్బ్స్ ఆసియా జాబితాలో సానియా, కోహ్లి
56 మంది భారతీయులకు చోటు
న్యూయార్క్: అమెరికాకు చెందిన ప్రముఖ మేగజైన్ ‘ఫోర్బ్స్’ ఆసియన్ క్రీడాకారుల్లో 30 ఏళ్ల లోపున్న అత్యంత ప్రతిభావంతుల జాబితా విడుదల చేసింది. ఇందులో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, క్రికెట్ క్రీడాకారుడు విరాట్ కోహ్లి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌లకు చోటు దక్కింది. భారత్, చైనా, హాంకాంగ్, సింగపూర్ తదితర దేశాల నుంచి 300 మంది క్రీడాకారుల్ని ‘ప్రామిసింగ్ యంగ్ లీడర్స్ అండ్ గేమ్ చేంజర్స్’ కింద ఎంపిక చేశారు. జాబితాలో 56 మంది భారతీయులకు చోటు దక్కింది. గత జనవరిలో 27 ఏళ్ల కోహ్లి ఆధ్వర్యంలో భారత జట్టు ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ చేసి ట్వంటీ20 సిరీస్‌ను గెల్చుకుందని ఫోర్బ్స్ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
భారత్‌లో అత్యధికంగా ఆర్జించే ప్రముఖుల్లో కోహ్లి కూడా ఒకరని.. కిందటేడాది ఆయన అత్యధికంగా 11.3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 77.76 కోట్లు) ఆర్జించారని పేర్కొంది. ప్రపంచ మహిళా టెన్నిస్ డబుల్స్ నెంబర్‌వన్ క్రీడాకారిణి అయిన సానియా (29) భారత దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే ప్రముఖ అథ్లెట్‌గా ఫోర్బ్స్ పేర్కొంది. బ్యాడ్మింటన్ సింగిల్స్ వరల్డ్ నంబర్‌వన్ క్రీడాకారిణి అయిన సైనా నెహ్వాల్ (26)ను ప్రపంచంలో 24 మంది అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరిగా అభివర్ణించింది.