
న్యూఢిల్లీ: భారత తొలి హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతిష్టను మసకబార్చేందుకు కొన్ని పార్టీలు, ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నించాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఏకం చేసే పనిలో పటేల్ పాత్రను చరిత్ర నుంచి తొలగించే పని చేశారని మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల సమయంలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మంగళవారం ఢిల్లీలో పటేల్ 142వ జయంతి సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం నుంచి.. ఇండియాగేట్ వరకు జరిగిన ఐక్యతా పరుగును మోదీ ప్రారంభించారు. ‘తొలి కేంద్ర హోం మంత్రి రాజనీతిజ్ఞత, రాజకీయ చతురత కారణంగానే దేశం నేడు ఐక్యంగా ఉంది. దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలనుకున్న వలసపాలకుల ఆలోచన కార్యరూపం దాల్చకుండా పటేల్ వ్యవహరించిన తీరు అద్భుతం.
కానీ పటేల్ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలు జరిగాయి. పటేల్ చేసిన సేవలను మరిచిపోయేలా చేశారు. కానీ సర్దార్ సర్దారే. ఏ ప్రభుత్వమైనా, పార్టీ అయినా గుర్తింపునిచ్చినా ఇవ్వకపోయినా.. దేశ నిర్మాణంలో ఆయన పాత్రను యువత ఎన్నటికీ మరవదు’ అని ప్రధాని పేర్కొన్నారు.
అన్ని మార్గాలను అనుసరించి..
స్వాతంత్య్రానంతరం భారతంలోని ఎన్నో సమస్యల పరిష్కారంలో, దేశాన్ని ఏకం చేయటంలో ఆయన పాత్ర మరవలేనిదని మోదీ అన్నారు. ‘బ్రిటిష్ ప్రభుత్వం దేశాన్ని చిన్న రాజ్యాలుగా విభజించాలనుకుంది.
కానీ పటేల్ సామ, దాన, భేద, దండ, రాజనీతిలనుపయోగించి తక్కువ సమయంలోనే రాజ్యాలను కలిపేశారు’ అని ఆయన చెప్పారు. తరతరాలుగా భారతీయులు పటేల్‌ను గుర్తుచేసుకుంటూనే ఉన్నారన్నారు. అంతకుముందు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పార్లమెంటు స్ట్రీట్ లోని పటేల్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు.
కాంగ్రెస్ మండిపాటు
పటేల్ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేశారన్న మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. సర్దార్ పటేల్ పేరును మోదీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించింది.
గాంధీ హత్య తర్వాత పటేల్ ఆరెస్సెస్‌పై నిషేధం విధించిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించింది. ‘సంఘ్ నేతల ప్రసంగాలు విషపూరితం. వీటి కారణంగానే గాంధీ హత్యకు గురయ్యారు’ అని పటేల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ట్వీట్ చేసింది. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆరెస్సెస్ పాత్రేంటో తెలపాలని ప్రశ్నించింది.
అది 125 కోట్ల ప్రజల బాధ్యత
భిన్నత్వంలో భారత శక్తి దాగి ఉందన్న మోదీ.. ‘వివిధ భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన శైలులు, ఆహారపు అలవాట్లున్నప్పటికీ అవన్నీ మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. భిన్నత్వమే భారత్‌కు గర్వకారణం’ అని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో ఒకే విశ్వాసంతో ఉన్న వారు కూడా ఒకరినొకరు చంపుకుంటారని చెప్పిన మోదీ.. భారత్‌లో భిన్న విశ్వాసాల ప్రజలు ఐకమత్యంతో జీవిస్తుండటం గొప్ప విషయమన్నారు.
దేశం ఎప్పటికీ ఐక్యంగా ఉండేలా 125 కోట్ల మంది ప్రజలు బాధ్యత తీసుకోవాలని ప్రధాని సూచించారు. తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కూడా భారత్ ఒకే దేశంగా ఉండటానికి పటేల్ నేతృత్వమే కారణమని పేర్కొన్న విషయాన్నీ మోదీ గుర్తుచేశారు. సమావేశం ప్రారంభంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మోదీ నివాళులర్పించారు. స్వాతంత్య్రానంతరం రేగిన మత కలహాలను సైతం పటేల్ సమర్థవంతంగా అదుపులోకి తీసుకొచ్చారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అక్టోబర్ 31ని కేంద్ర ప్రభుత్వం ‘రాష్ట్రీయ ఏకతా దివస్’గా జరుపుతోంది.
కేంద్ర మంత్రులు అనంతకుమార్, విజయ్ గోయల్, రాజ్‌వర్ధన్ సింగ్ రాథోడ్, హర్‌దీప్ పురీతోపాటు ఉన్నతాధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. సర్దార్ సింగ్, దీపా కర్మాకర్, సురేశ్ రైనా, కరణం మల్లీశ్వరి తదితరులు హాజరయ్యారు. ఈ పరుగులో పాల్గొనటం గర్వంగా ఉందని సర్దార్ సింగ్, దీపా కర్మాకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment