
జైలు బయట శశికళ షికార్లు!
ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో
సాక్షి, బెంగళూరు: అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళ(61)కు రాజభోగాలు అందుతున్నాయని ఫిర్యాదు చేసిన జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప.. అందుకు సంబంధించిన ఆధారాలను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు సమర్పించారు. వాటిలో ఓ వీడియో తాజాగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సల్వార్ కమీజ్ ధరించిన శశికళ, ఆమె బంధువు ఇళవరసితో కలసి షాపింగ్ బ్యాగులతో జైలులోకి వస్తున్నారు. ఆ సమయంలో ముగ్గురు పురుష సెంట్రీలు కూడా అక్కడ ఉన్నారు.
జైలు నిబంధనల ప్రకారం మహిళా ఖైదీల బ్యారక్ వద్ద పురుష వార్డన్‌లు, సెంట్రీలు కానీ ఉండకూడదు. అదే సమయంలో మహిళా సూపరింటెండెంట్ అధికారి కూడా శశికళ, ఇళవరసిలతోపాటు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే శశికళ బయటి నుంచి వస్తున్నారనే అనుమానించాల్సి ఉంటుందని ఓ పోలీస్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. జైల్లో శశికళ రాజభోగాలు పొందిన వైనంపై మరో 74 ఆధారాలు కూడా ఏసీబీకి చేరాయి. అయితే ఈ వీడియోను ఏ రోజు రికార్డు చేశారన్న అంశంపై స్పష్టత లేదు. మరోవైపు ఈ ఘటన గురించి తనకెలాంటి సమాచారం లేదని జైలు డైరెక్టర్ జనరల్ నహర్ సింగ్ మేఘరిఖ్ తెలిపారు.