వ్యవస్థలో మార్పు తీసుకు రావడమే తమ లక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ : వ్యవస్థలో మార్పు తీసుకు రావడమే తమ లక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ సాగిస్తున్న అప్రజాస్వామిక రాజకీయాలు, అధికార టీడీపీ అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష శాసనసభ్యులను కొనుగోలు చేస్తున్న తీరును జగన్ నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం సేవ్ డెమొక్రసీ పేరిట ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ చంద్రబాబు నాయుడు.. వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలకు పచ్చకండువా కప్పి పార్టీలోకి తీసుకుంటున్న పరిస్థితులను వివరించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అంశాన్ని స్పీకర్ పరిధిలో నుంచి తీసేసి, ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకువస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. అప్పటివరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫిరాయింపులపై కోర్టును కూడా ఆశ్రయిస్తామని వైఎస్ జగన్ తెలిపారు.