ఎస్సీ, ఎస్టీ వేధింపుల పరిహారం పెంపు | SC, ST harassment enhanced compensation | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ వేధింపుల పరిహారం పెంపు

Published Sun, Apr 24 2016 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

SC, ST harassment enhanced compensation

♦ రేప్ బాధితులకు రూ. 5 లక్షలు
♦ సామూహిక అత్యాచార బాధితులకు రూ. 8.25 లక్షలు
 
 న్యూఢిల్లీ: ఇకపై అత్యాచారానికి గురైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 5 లక్షల వరకు, సామూహిక అత్యాచారానికి గురైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 8.25 లక్షల వరకు పరిహారం లభించనుంది. ఇతర తీవ్రస్థాయి వేధింపులకు గురైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు విచారణ పూర్తయిన వెంటనే, నేర నిర్ధారణ కన్నా ముందే, పరిహారం లభించనుంది. ఈ మేరకు ‘ఎస్సీ, ఎస్టీలపై వేధింపు నిరోధక చట్ట సవరణ నిబంధనలు- 2016’లో ప్రభుత్వం శనివారం ప్రత్యేక మార్పులు చేసింది. వేధింపుల నిర్వచనంలో తాజాగా రేప్, గ్యాంగ్ రేప్ అనే పదాలనూ చేర్చింది. ఎస్సీ, ఎస్టీలపై వేధింపులకు సంబంధించి నేరం జరిగిన 60 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు ప్రక్రియ పూర్తికావాలని పేర్కొన్నారు. గతంలో ఈ పరిమితి లేదు.

మాటలు, సైగల  ద్వారా  లైంగిక వేధింపులకు గురైన బాధితులకు వైద్యపరీక్షలు తప్పనిసరి కాదనే నిబంధన చేర్చారు. రేప్, గ్యాంగ్ రేప్ బాధితులకు ప్రకటించిన పరిహారంలో.. వైద్య పరీక్షల్లో లైంగిక వేధింపును నిర్ధారించాక 50%, కోర్టుకు చార్జిషీటు అందించిన తరువాత 25%, కోర్టు విచారణ ముగిశాక మిగతా 25% అందించాలని తెలిపారు. బాధితులకు ప్రకటించిన తక్షణ పరిహారం కానీ, ఉపశమన చర్యలు కానీ, లేదా రెండు కానీ వేధింపునకు గురైన వారికి కానీ, వారి కుటుంబసభ్యులకు కానీ ఆ ఘటన జరిగిన వారంలోగా అందించాలని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నిబంధనలో పేర్కొన్నారు. ఈ బాధ్యతను సంబంధిత జిల్లా కలెక్టర్ తీసుకోవాలన్నారు. ఈ తక్షణ పరిహారంలో దుస్తులు, ఆహారం, ఔషధాలు, వసతి తదితర నిత్యావసరాలు ఉండాలన్నారు. తాజా నిబంధనలతో బాధితులకు సత్వర న్యాయం జరిగే అవకాశముందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement