సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో 16 షెల్టర్ హోంల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన పలు కేసులను సుప్రీం కోర్టు బుధవారం సీబీఐకి బదలాయించింది. ఆయా కేసుల్లో దర్యాప్తును బదలాయించవద్దన్న బిహార్ ప్రభుత్వ వినతిని తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్ధానం బిహార్ పోలీసుల నుంచి షెల్టర్ హోం కేసుల విచారణను సీబీఐకి బదలాయించింది. జస్టిస్ మదన్ బీ లోకుర్ నేతృత్వంలో జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
బిహార్‌లో వెలుగు చూసిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) నివేదిక తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోందని, చిన్నారులపై అకృత్యాలు జరిగిన షెల్టర్ హోంల వ్యవహారాలను సీబీఐ నిగ్గుతేల్చాలని ఆదేశించింది. బిహార్ షెల్టర్ హోంల అకృత్యాలపై విచారణ చేపట్టేందుకు సీబీఐ కోర్టుకు తన సంసిద్ధత వెల్లడించింది.
ఇప్పటికే ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసును విచారిస్తున్న సీబీఐ డిసెంబర్ 7 నాటికి చార్జిషీట్ సమర్పిస్తుందని భావిస్తున్నారు. బిహార్‌లో షెల్టర్ హోం కేసులను విచారిస్తున్న సీబీఐ అధికారులను తన ముందస్తు అనుమతి లేకుండా బదిలీ చేయరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment