సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన బీహార్‌లోని ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో చిన్నారులపై లైంగిక దాడి కేసులో సీబీఐ సర్వోన్నత న్యాయస్ధానానికి పలు వివరాలు అందించింది. షెల్టర్ హోం చిన్నారుల హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ బుధవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. షెల్టర్ హోం వద్ద స్వాధీనం చేసుకున్న రెండు అస్తిపంజరాలు ఓ మహిళ, పురుషుడివిగా ఫోరెన్సిక్ పరిశోధనలో వెల్లడైందని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని సుప్రీం బెంచ్ సీబీఐ స్టేటస్ రిపోర్ట్‌ను అంగీకరించింది.
విచారణ బృందంలో ఇద్దరు అధికారులను రిలీవ్ చేసేందుకు అనుమతించింది. ఈ కేసులో బాలికలపై లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసి ఆయా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్టు సీబీఐ తరపున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. హత్యకు గురయ్యారని తొలుత భావించిన చిన్నారులను ఆపై సజీవంగా ఉన్నట్టు గుర్తించారని చెప్పారు. బిహార్‌లో 17 షెల్టర్ హోమ్స్ కేసుల్లో విచారణ చేపట్టి 13 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశారని, నాలుగు కేసుల్లో సరైన ఆధారాలు లేక కేసులను మూసివేశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment