జైల్లో ఖైదీలమధ్య ఘర్షణ.. ముగ్గురు మృతి
ఇంఫాల్ః ఖైదీల మధ్య తలెత్తిన వివాదం ముగ్గురి ప్రాణాలను తీసింది. జైల్లోని ఖైదీల్లో ముందుగా ఇద్దరు కలసి ఓ ఖైదీపై దాడి చేసి హత్య చేశారు. విషయం తెలిసిన అనంతరం సెల్ లోని ఇతర ఖైదీలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ ఖైదీ హత్యకు పాల్పడ్డ ఇద్దరు ఖైదీలపై దాడి చేసి, ఇద్దరినీ హతమార్చారు.
మణిపూర్ సెంట్రల్ జైల్లో జరిగిన ఘటన సంచలనం రేపింది. ఖైదీల మధ్య చెలరేగిన వివాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో వారికి తలెత్తిన ఘర్షణల్లో ఖైదీలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ముందుగా 21 ఏళ్ళ యూసుఫ్, 22 ఏళ్ళ అబ్డస్ లు.. గ్రేటర్ ఇంఫాల్ ప్రాంతంలో ఉన్న జైల్లోని ఛురఛంద్ పూర్ జిల్లాకు చెందిన థంగమిన్లెన్ జౌ అనే ఖైదీపై దాడి చేసి హత్య చేసినట్లు అడిషనల్ డీజీపీ పి. డౌంగెల్ తెలిపారు. థంగమిన్లెన్ జౌ హత్య విషయం తెలిసి ఆగ్రహించిన మిగిలిన ఖైదీలు జైల్లోని సెక్టర్-1, 4 వ సెల్ లోని అబ్డస్, యూసుఫ్ లను హతమార్చినట్లు డౌంగెల్ వెల్లడించారు. ఈ ఘర్షణల్లో వారిని అడ్డుకునేందుకు వెళ్ళిన ముగ్గురు జైలు అధికారులు సహా ఓ ట్రయల్ లో ఉన్న వ్యక్తి కూడా గాయపడినట్లు ఆయన తెలిపారు.