రెజ్లర్ల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్న దీక్షా స్థలి ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్ర బిందువైంది. రెజ్లర్లు, వారికి మద్దతుగా వచ్చిన ఆప్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, చివరకు తోపులాట, ఘర్షణకు దారితీసింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దీక్షా శిబిరం వద్ద వర్షాలతో రెజ్లర్లు వినియోగిస్తున్న పరుపులు తడిసి ముద్దయ్యాయి.
వారికి సాయపడేందుకు కొన్ని చెక్క మంచాలను ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి తన కార్యకర్తలతో తెప్పించారు. వాటిని రెజ్లర్లకు ఇచ్చేందుకు అనుమతించేది లేదని, జంతర్‌మంతర్‌ను శాశ్వత దీక్షాశిబిరంగా మార్చేందుకు అనుమతులు లేవని అక్కడే మొహరించిన పోలీసులు తెగేసి చెప్పారు.
అయినా సరే కొన్ని మంచాలను రెజ్లర్లకు కార్యకర్తలు ఇవ్వడం, వాటిని రెజ్లర్లు శిబిరంలోకి తీసుకెళ్తుండటంతో పోలీసులు, ఆప్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. తమకు సాయపడేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో రెజ్లర్లు వారితో వాదనకు దిగారు. దీంతో రెజ్లర్లు, కార్యకర్తలను నిలువరించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు బలప్రయోగం చేశారు. ఇరువర్గాల వాదనలు చివరకు తోపులాటలు, ఘర్షణకు దారితీశాయి. ఈ ఘటనలో రాహుల్ యాదవ్, దుష్యంత్ ఫొగాట్‌సహా పలువురు రెజ్లర్లకు గాయాలయ్యాయి.
వినేశ్ ఫొగాట్ కంటతడి
నన్ను తిట్టారు. నేలకు పడేశారు. పురుష పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారు. ఒక్క మహిళా పోలీసు అయినా ఉన్నారా ఇక్కడ?. మమ్మల్ని చంపేద్దామనుకుంటున్నారా? చంపేయండి. ఇలాంటి రోజు కోసమేనా మేం దేశం కోసం పతకాలు సాధించింది? అంటూ ప్రముఖ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ కన్నీరు పెట్టుకున్నారు. తాము సాధించిన పతకాలు, కేంద్రం ఇచ్చిన అవార్డులు, పద్మశ్రీ అన్నీ వెనక్కి ఇస్తామని రెజ్లర్లు హెచ్చరించారు.
విపక్షాల తీవ్ర ఆగ్రహం
రెజ్లర్లపై పోలీసుల దాడి దారుణమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ‘ఆటగాళ్లపై పోలీసుల దాడి సిగ్గు చేటు. సమాఖ్య చీఫ్ శరణ్‌ను ఆ పదవి నుంచి మోదీ తొలగించాలి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘కోర్టు పర్యవేక్షణలో ఘటనపై దర్యాప్తు జరగాలి. కనీసం ఘటనాస్థలికి వెళ్లి మోదీ రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించాలి’ అని కాంగ్రెస్ డిమాండ్చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితర నేతలూ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.