భద్రత కట్టుదిట్టం
‘ఉగ్రవాదుల చొరబాటు’తో అప్రమత్తమైన కేంద్రం
♦ శివరాత్రి సందర్భంగా ప్రధాన శివాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
♦ జాగ్రత్తగా ఉండాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకూ సమాచారం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: మహా శివరాత్రి సందర్భంగా ముఖ్య నగరాల్లోని ముఖ్యమైన శివాలయాలు, వ్యూహాత్మక నిర్మాణాలు, కీలక ప్రాంతాల వద్ద ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో సోమవారం కూడా దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగింది. భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడాలన్న లక్ష్యంతో పాక్ సరిహద్దులు దాటి గుజరాత్ గుండా లష్కరే, జైషే ఉగ్రసంస్థలకు చెందిన 10 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారన్న వార్తల నేపథ్యంలో.. ఐబీ డెరైక్టర్ దినేశ్వర్ శర్మ, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సహా భద్రతావిభాగాల ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమై, అంతర్గత భద్రతపై సమీక్ష జరిపారు.
అన్ని ప్రధాన నగరాల్లో అత్యంత అప్రమత్తతతో ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన నగరాలు, కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్, చండీగఢ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రం సమాచారం పంపించింది. శివరాత్రి సందర్భంగా ఢిల్లీలోని శివాలయాలు, కీలక భవన సముదాయాలు, మెట్రో స్టేషన్లు, ప్రముఖ మార్కెట్ ప్రాంతాల్లో భద్రతాబలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. గుజరాత్ నుంచే ఉగ్రవాదులు దేశంలోకి అడుగుపెట్టారన్న వార్తల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఆనందిబెన్ పటేల్ అహ్మదాబాద్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై భద్రతను సమీక్షించారు.
సోమనాథ్ గుడి ఉగ్రవాదుల లక్ష్యంగా ఉన్నందున అక్కడ 250 మంది పోలీసులు, ఎన్‌ఎస్‌జీ కమెండోలతో భద్రతాఏర్పాట్లు చేశారు. గుజరాత్ సహా ఉగ్రదాడులకు అవకాశం ఉన్న రాష్ట్రాల్లోని వ్యూహాత్మక ప్రాంతాలు, ఆలయాలు, పారిశ్రామిక కేంద్రాలు సహా అన్ని ప్రముఖ ప్రదేశాల్లో సెక్యూరిటీని పెంచాలని ఆదేశించామని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి సంబంధించిన అన్ని భద్రతాపరమైన కార్యకలాపాల విషయమై ఇకపై బీసీఏఎస్(బ్యూరొ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ)ను సంప్రదించాలని సీఐఎస్‌ఎఫ్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశించింది. ఇప్పటివరకు అలాంటి అంశాల్లో తొలుత ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌ను సీఐఎస్‌ఎఫ్ సంప్రదించేంది.