
ముష్కరుల దురాగతం; తిప్పికొట్టిన ఆర్మీ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా ప్రాంతంలో తీవ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు అధికారులతో సహా ఏడుగురు సైనికులు అమరులయ్యారు. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో సైనిక దుస్తుల్లో ఆర్మీ యూనిట్ లోకి ప్రవేశించిన ముగ్గురు తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
హోరాహోరీ పోరాటం తర్వాత తీవ్రవాదులను సైనిక దళాలు హతమార్చాయి. బందీలుగా పట్టుకున్న 12 మంది జవాన్లు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులను భద్రతా దళాలు కాపాడాయి. నగ్రోటా ప్రాంతంలో సైనిక దళాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఎన్ కౌంటర్ వివరాలను ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్.. రక్షణమంత్రి మనోహర్ పరీకర్ కు వివరించారు. జాతీయ భద్రతా సలహారు అజిత్ దోవల్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
చమ్లియాల్ ప్రాంతంలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ముగ్గురు చొరబాటుదారులను బీఎస్‌ఎఫ్ బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు.