చెన్నై: తమిళనాడుకు చెందిన ఏడుగురు జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పదుకొట్టాయ్ మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శేఖర్ వెల్లడించారు. పదుకొట్టాయ్ జిల్లా జగదపట్టణానికి చెందిన ఏడుగురు జాలర్లు చేపల వేటకు వెళ్లగా తమ సముద్రజలాల పరిధిలోకి వచ్చారని ఆరోపిస్తూ లంక అధికారులు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రెండు పడవలను సీజ్ చేశారు.
గత మూడు రోజుల కిందట 10 మేషిన్ బోట్లతో తమిళ జాలర్లు అక్రమంగా తమ పరిధిలోని నెడుంతురయ్ సమీపంలోకి చేపలవేటకు వచ్చారని, అధికారులు ఫొటోలు కూడా తీశారని లంక నేవీ ఆరోపించింది. ఐదుగురు జాలర్లు సముద్రంలో చిక్కుకుపోగా తమ అధికారులే భారత జాలర్లను రక్షించినట్లు లంక తమకు సమాచారం అందించిందని అధికారి శేఖర్ వివరించారు.