సాక్షి, చైన్నె: శ్రీలంక సేనలు తగ్గడం లేదు. మళ్లీ తమిళ జాలర్లపై దాడి చేశారు. ఈ ఘటన తమిళ జాలర్లలో ఆగ్రహాన్ని రేపింది. ఈనెలలో ఇప్పటికే రెండుసార్లు తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీఎం స్టాలిన్ సైతం తీవ్రంగా పరిగణించారు. దాడులు కట్టడి చేయాలని కోరుతూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయ శంకర్‌కు లేఖ కూడా రాశారు. అలాగే శ్రీలంక నావికాదళంపై వేదారణ్యం మైరెన్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
అయినా, తాము తగ్గేది లేదన్నట్టు శ్రీలంక సేనలు వ్యవహరిస్తున్నారు. కారైక్కాల్‌కు చెందిన అంజప్పర్ పడవలో మైలాడుతురైకు చెందిన 11 మంది జాలర్లు చేపల వేటకు వెళ్లారు. శనివారం రాత్రి కోడికరై వద్ద వేటలో ఉన్న వీరిపై శ్రీలంక సేనలు విరుచుకుపడ్డారు. వలలు, జీపీఎస్ తదితర పరికరాలను స్వాఽధీనం చేసుకున్నారు. అలాగే, సముద్రంలో దూకమని చెప్పి జాలర్లను చిత్రహింసలకు గురిచేశారు.
సముద్రంలో ఈదుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జాలర్లు వేదనపడగా, శ్రీలంక సేనలు అనందించి వెళ్లారు. ఆ సేనలు వెళ్లడంతో అతి కష్టంపై ఒడ్డుకు చేరుకున్న జాలర్లు మత్స్యశాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై జరిగిన దాడిని జాలర్ల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. శ్రీలంక సేనలు రోజురోజుకు విరుచుకుపడుతుండడంతో పోరుబాటకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment