
'నన్నడిగితే సంతోషంగా ఒప్పుకుంటా'
బిహార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలన్న ఆకాంక్షను బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా వ్యక్తం చేశారు.
పట్నా: బిహార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలన్న ఆకాంక్షను బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా వ్యక్తం చేశారు. తనను బిహార్ అంబాసిడర్ గా ఉండమంటే సంతోషంగా అంగీకరిస్తానని ఆయన చెప్పారు. బిహార్ ప్రచారకర్తగా తనను ప్రమోట్ చేస్తే హర్షిస్తానని అన్నారు. 'బిహారి బాబు'గా సుపరిచితుడైన శత్రుఘ్నసిన్హాను బిహార్ బ్రాండ్ అంబాసిడర్ నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం తరపున తనను ఎవరూ సంప్రదింలేదని ఆయన తెలిపారు.
'అధికారికంగా నాతో ఎవరు చర్చలు జరపలేదు. బిహార్ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యత ప్రియ మిత్రుడు నితీశ్ కుమార్ నాకు అప్పగిస్తే, తన సొంత రాష్ట్రంకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. బిహార్ భూమి పుత్రుడిగా ఇది నా బాధ్యతగా భావిస్తున్నా'ని శత్రుఘ్నసిన్హా అన్నారు. ఈ విషయంలో తన నుంచి డిమాండ్ లేదా కమాండ్ ఏమీ లేదని జైపూర్ నుంచి ఫోన్ లో పీటీఐతో చెప్పారు. నితీశ్ కుమార్ పాలన బాగుందని, ఆయన తనకు తమ్ముడు లాంటివాడని 70 ఏళ్ల సిన్హా పేర్కొన్నారు. కాగా, బ్రాండ్ అంబాసిర్లుగా ఎంపీ రేఖ, రచయిత జావేద్ అక్తర్ పేర్లను కూడా బిహార్ పర్యాటక పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.