మాకేంటో తేల్చండి | shiv sena demand to BJP | Sakshi
Sakshi News home page

మాకేంటో తేల్చండి

Published Thu, Nov 6 2014 10:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మాకేంటో తేల్చండి - Sakshi

మాకేంటో తేల్చండి

సాక్షి, ముంబై: ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వలేనట్టయితే కేంద్రంలో మరో మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తోంది. అందిన వివరాల మేరకు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేనట్టయితే కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చిన సరేనని శివసేన పేర్కొంటున్న సమచారం. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలూ ఒంటరిగానే బరిలో దిగిన నేపథ్యంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా బీజేపీ నిలిచింది.

ఆ పార్టీకి 122 స్థానాలు దక్కాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సభ్యులు లేకపోయినప్పటికీ ఇప్పటికే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తన మెజారిటీని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాత మిత్రుడైన శివసేన మద్దతు తీసుకునేందుకు బీజేపీ సానుకూలంగా ఉన్నప్పటికీ పదవుల విషయంలో వాటి ‘పొత్తు’పై ఉత్కంఠత కొనసాగుతోంది.

బల నిరూపణకు ముందే ఉపముఖ్యమంత్రి పదవితోపాటు మరో 10 మంత్రి పదవులు ఇవ్వాలని శివసేన కోరుతుండగా అసెంబ్లీ సమావేశాల తర్వాతే దానిపై మాట్లాడుకుందామని బీజేపీ అంటోంది. దీంతో వీరి మధ్య సంప్రదింపులు ముందుకు సాగడం లేదు. కాగా, తమతో పొత్తుపై వెంటనే ఏదో ఒకటి తేల్చుకోవాలని శివసేన ఒత్తిడి పెంచింది. లేదంటే ప్రతిపక్షంలో కూర్చోడానికి సైతం తాము వెనుకాడబోమని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ సమావేశాల తర్వాతే మంత్రి మండలి విస్తరణ ఉంటుందని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇప్పటికే ప్రకటించారు.

దీంతో ఈ రెండు పార్టీల మధ్య తిరిగి పొత్తు కుదురుతుందో లేదోనని అంతటా ఉత్కంఠత నెలకొంది. అయితే, 10వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే ఈ రెండు పార్టీలూ ‘పొత్తు’పై ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

 ఇదిలా ఉండగా, ఈ విషయంపై గురువారం మాతోశ్రీలో శివసేన నాయకులతో ఉద్దవ్ ఠాక్రే చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ ముందు మళ్లీ ఎలాంటి ప్రతిపాదనలు ఉంచాలనే విషయంపై చర్చ జరిగినట్లు సమాచారం. అందిన వివరాలమేరకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వనట్టయితే కేంద్రంలో మరో మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీని కోరినట్టు సమాచారం.

ఇటీవల జరిగిన నూతన సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడంలేదని మొదటి శివసేన ప్రకటించింది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఫోన్ చేయడంతో చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్న  ఉద్ధవ్ ఠాక్రే సహా ఆ పార్టీకి చెందిన అందరూ కార్యక్రమానికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. అదేవిధంగా ప్రస్తుత ప్రతిష్టంభన కూడా చివరి నిమిషంలో కీలక మలుపు తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

 ప్రతిపక్షమైనా ఓకే..
 బీజేపీ నుంచి తమకు సరైన గౌరవం లభించడంలేదని భావన శివసేన నాయకుల్లో కన్పిస్తోంది. దీంతో ప్రతిపక్షంలో కొనసాగాలని శివసేన యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వంలో బాగాస్వామ్యం చేసుకునే విషయంపై బీజేపీ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడం శివసేనకు ఇబ్బందికరంగా మారింది. ఓవైపు కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు అధికారం కోసం శివసేన పాకులాడుతోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

 ఇలాంటి నేపథ్యంలో ఆలస్యం చేసినట్టయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోనుంది. ఎమ్మెల్యేల సంఖ్యపరంగా అసెంబ్లీలో ద్వితీయ స్థానంలో శివసేన ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉండనున్నట్టు గవర్నర్‌కు లేఖ ఇవ్వనట్టయితే తృతీయ స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా లభించనుంది. దీంతో బీజేపీతో చేతులు కలుపుతుందా.. లేదా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠత కన్పిస్తోంది. అయితే చివరి క్షణంలో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరగకుండా ఉండేందుకు బీజేపీకి మద్దతు ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement