చీలిక దిశగా సైకిల్ పార్టీ?
చక్రం తిప్పుతున్న చిన్నాన్న
సీఎం పీకేసిన మంత్రిని కలిసిన శివపాల్
అనుచరులంతా పార్టీ ఆఫీసుకు వెళ్లాలని సూచన
లక్నో:
అంతా అయిపోయింది.. సమాజ్‌వాదీ పార్టీలో చీలికకు అంతా సిద్ధమైంది. రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, ములాయం సింగ్ సోదరుడు శివపాల్ యాదవ్ క్రమంగా చక్రం తిప్పుతున్నారు. గురువారం రాత్రి తన మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసిన శివపాల్... శుక్రవారం ఉదయం తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేయాలని చెబుతూనే, ములాయం సింగ్ యాదవ్ పార్టీ కార్యాలయానికి వస్తారని, మీరంతా వెళ్లి ఆయనను కలవాలని చెప్పారు. దానికి తోడు.. ఇటీవలే సీఎం అఖిలేష్ యాదవ్ తన మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికిన ఇద్దరు మంత్రులలో ఒకరైన గాయత్రీ ప్రజాపతిని కూడా వెళ్లి కలిశారు. అవినీతిపరులన్న కారణంగా మంత్రివర్గం నుంచి ఇద్దరిని తప్పించడమే అఖిలేష్ - శివపాల్ మధ్య విభేదాలకు ఆజ్యం పోసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సింఘాల్‌ను కూడా అఖిలేష్ ఇంటికి పంపేశారు.
తన తండ్రి పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌తోను, సీఎం అఖిలేష్‌తోను ఫోన్లో మాట్లాడుతున్నారని శివపాల్ కుమారుడు ఆదిత్య యాదవ్ చెప్పారు. శివపాల్ గౌరవ మర్యాదలను కాపాడాలని, ఆయన నుంచి తప్పించిన మంత్రిత్వశాఖలన్నింటినీ తిరిగి ఇవ్వాలని, సమాజ్‌వాదీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కూడా ఇవ్వాలని ఆయన మద్దతుదారులు శివపాల్ ఇంటి ముందు నినాదాలు చేశారు. వాళ్లు రాత్రంతా కూడా ఆయన ఇంటి ముందే ఉండిపోయారు. తాము నిద్రపోయేది లేదు.. వాళ్లను నిద్రపోనిచ్చేది లేదంటూ నినదించారు.
మొదట్లో కీలక మంత్రిత్వశాఖలను నిర్వర్తించిన శివపాల్ యాదవ్‌కు.. ముఖ్యమైన శాఖలను ఆయన నుంచి తప్పించడంతో ఎక్కడలేని కోపం వచ్చింది. అది చాలదన్నట్లు తనవాళ్లు అనుకున్న ఇద్దరు మంత్రులను, సీఎస్‌ను కూడా పంపేయడంతో ఇక ఆయన తాడోపేడో తేల్చుకోవాలన్న దశకు వచ్చేశారు. అయితే, మంత్రిపదవికి ఆయన చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తిరస్కరించారు. మరో వైపు పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా విషయం ఏంటన్నది ఇంకా తెలియలేదు.