భక్తుల సందర్శనార్థం శివకుమారస్వామి పార్థివదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యం, శివకుమార స్వామి
సాక్షి, బెంగళూరు: కన్నడనాట మహారుషి, అభినవ బసవణ్ణగా పేరుపొందిన తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి, పద్మభూషణ్, కర్ణాటక రత్న పురస్కారాల గ్రహీత డాక్టర్ శ్రీ శివకుమార స్వామి శివైక్యం చెందారు. వీరశైవ లింగాయత్ వర్గానికి చెందిన 111 ఏళ్ల స్వామీజీ కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం ఉదయం 11.44 గంటలకు మఠంలోనే స్వామి కన్నుమూశారు. శివకుమారస్వామి అస్తమయంతో కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లోని అశేష భక్తజనం శోకసంద్రంలో మునిగిపోయారు. కర్ణాటక సీఎం కుమారస్వామితో సహా పెద్దసంఖ్యలో మంత్రులు, శాసనసభ్యులు, ప్రముఖులు తుమకూరు మఠానికి తరలివచ్చారు. వేలాదిమంది భక్తులు స్వామీజీ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
నడిచే దైవంగా గుర్తింపు..
శివకుమార స్వామి తన జీవితకాలంలో ఎన్నో సంఘ సేవా కార్యక్రమాలు చేపట్టారు. 1908 ఏప్రిల్ 1న బెంగళూరుకు సమీపంలోని మాగడి తాలూకా వీరాపుర గ్రామంలో పటేల్ హోనప్ప, గంగమ్మ దంపతులకు చివరి సంతానంగా శివకుమార స్వామి జన్మించారు. 1930 నుంచి ఇప్పటివరకు 9 దశాబ్దాల పాటు సిద్ధగంగా మఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. అన్నదానం, విద్యాదానం, ఆశ్రయం కల్పించి లక్షలాది మందిని ఆదుకున్నారు. కులమతాల వివక్ష లేకుండా లక్షల మంది ఆకలి తీర్చి, జ్ఞానాన్ని ప్రసాదించారు. అందుకే ఆయనకున్న లక్షలాది మంది భక్తులు స్వామిని నడిచే దైవమని నమ్ముతారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం, మాజీప్రధాని వాజ్‌పేయి, కాంగ్రెస్ ప్రముఖులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రధాని నరేంద్రమోదీ సహా ఎందరెందరో అత్యంత ప్రముఖులు, ముఖ్యమంత్రులు కూడా ఎప్పుడో ఒకప్పడు స్వామిని కలిసి పాదాభివందనాలు చేసినవారే.
మఠంలోనే కన్నుమూత
శివ కుమారస్వామి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో చెన్నై, తుమకూరు, బెంగళూరు ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. అయితే స్వామీజీ కోరిక మేరకు గత గురువారం మఠానికే తరలించి ఆయనకు అక్కడే చికిత్సను అందిస్తున్నారు. సోమవారం పరిస్థితి విషమించి స్వామి కన్ను మూశారనీ సిద్ధగంగ మఠం ప్రకటించింది. సీఎం కుమారస్వామి, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప, ఇతరత్రా రాజకీయ, సినీ ప్రముఖులు మఠానికి చేరుకుని నివాళులర్పించారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మఠంలోనే వీరశైవ లింగాయత్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుగుతాయి. స్వామి మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ సంతాపం తెలిపారు.
విద్యాదాతగా ఎనలేని గుర్తింపు
బెంగళూరు: శివకుమార స్వామికి కర్ణాటకలో విద్యాదాతగా ఎంతో గొప్ప పేరుంది. సాధారణంగా స్వామీజీలు ఆధ్యాత్మిక, భక్తి బోధనలు, కార్యకలాపాలకే పరిమితమవుతుంటారు. శివకుమార స్వామి మాత్రం సమాజసేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. నూట పదకొండేళ్ల వయసులో శివైక్యం పొందిన శివస్వామి ఆధ్యాత్మిక గురువుగా కంటే సంఘ సేవకుడిగానే ఎక్కువ ప్రాచుర్యం పొందారు. సిద్ధగంగ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు, వేద పాఠశాలలు సహా 125 విద్యా సంస్థల్ని నెలకొల్పి లక్షల మందికి విద్యాదానం చేశారు. కుల, మతాలకతీతంగా ఎందరినో విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దారు. ‘గురుకులం’ పేరుతో నిర్వహిస్తున్న ఈ విద్యా సంస్థల్లో ప్రస్తుతం 8,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కూడా అందజేస్తున్నారు. స్వామి ఆధ్వర్యంలో ఏటా వ్యవసాయ ఉత్సవం కూడా జరిగేది. దీనిద్వారా రైతులు ప్రయోజనం పొందేవారు. శివస్వామి వందేళ్ల పుట్టిన రోజుకు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం హాజరయ్యారు. స్వామి సేవల గురించి విని ఆయనను ఎంతగానో ప్రశంసించారు.
వివాదాలకు దూరం: శివకుమార స్వామి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2015లో పద్మభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది. 2007లో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డునిచ్చి గౌరవించింది. శతాధిక వయసులో కూడా ఆయన రోజూ భక్తులను, శిష్యులను కలుసుకుని మాట్లాడేవారు. కర్ణాటక పర్యటనకు వచ్చిన రాజకీయ నాయకులు దాదాపు అందరూ తుమకూరుకు వచ్చి స్వామి దర్శనం చేసుకోవడం నియమంగా పెట్టుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, రాహుల్ గాంధీ, కుమారస్వామి తదితరులంతా మఠానికి వచ్చి స్వామి ఆశీస్సులు పొందినవారే. అయితే శివకుమార స్వామి రాజకీయాలకు, వివాదాలకు దూరంగా ఉండేవారు. లింగాయత్‌ను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ ఉద్యమం జరిగినప్పుడు ఆయన స్పందించలేదు. ఈ విషయంలో మఠంలోని సన్యాసులు రెండుగా చీలిపోయినా ఆయన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
Comments
Please login to add a commentAdd a comment