సప్కాల్... అనాథల తల్లి
ఎవరూ లేని స్థాయి నుంచి తనకంటూ ఒక పెద్ద కుటుంబాన్ని సృష్టించుకున్న వైనమే ఈ కథనం.. ఈ ఫొటోలోని 68 ఏళ్ల మహిళ పేరు సింధుతై సప్కాల్. సప్కాల్ ఒక పేద కుటుంబంలో జన్మించింది. 9 ఏళ్ల వయసులో చదువును మధ్యలోనే ఆపేసింది. పదేళ్ల వయసులో 20 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పదేళ్ల తర్వాత సప్కాల్ గర్భం దాల్చింది. ఆ సమయంలో అండగా ఉండాల్సిన భర్త ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. నా అనుకున్న వాళ్లు కూడా ఎవరూ చేరదీయలేదు. పశువుల పాకలో ఒక పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. తనకు, తన కుమార్తె కోసం భిక్షాటన చేసింది.
ఆ సమయంలోనే తనలాగా కష్టాలు పడుతున్న యువతను చేరదీసి వారికి తన ఆహారాన్ని పంచేది. అలా అలా ఆమెను ఆశ్రయించిన వారు నేటికి 1400 మంది అయ్యారు. ప్రస్తుతం సప్కాల్‌ను అందరూ అనాథల తల్లి అని ముద్దుగా పిలుచుకుంటారు. అనాథలకు కావాల్సిన ఆహారం, నివాసం ఇవ్వడంతోపాటు వారికి కావాల్సిన∙ప్రేమను పంచేది. సప్కాల్ చేస్తున్న విశేష కృషికి ఇప్పటివరకు 750 అవార్డులు నడుచుకుంటూ వచ్చి ఆమె పాదక్రాంతం అయ్యాయి. పుణేలో సప్కాల్ నాలుగు అనాథశ్రమాలను నడుపుతోంది. అందులో రెండు అబ్చాయిలకు, రెండు అమ్మాయిలకు. తనను ఆశ్రయించిన అనాథలలో చాలా మంది లాయర్లుగా, డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా జీవితాల్లో స్థిరపడ్డారు. చాలా మందికి దగ్గరుండి వివాహాలు కూడా జరిపించింది. అలా అలా ఎవరూ లేని స్థాయి నుంచి ఒక పెద్ద కుటుంబానికి తల్లిలా మారింది.