బొగ్గు కార్మికుల సమ్మె విరమణ
కేంద్ర ప్రభుత్వం, యూనియన్లు ఒక అంగీకారానికి రావడంతో దేశవ్యాప్తంగా బొగ్గు కార్మికులు బుధవారం సమ్మె విరమించారు. సింగరేణిలో కూడా కార్మిక సంఘాలు సమ్మెను విరమించాయి.
న్యూఢిల్లీ/కొత్తగూడెం: కేంద్ర ప్రభుత్వం, యూనియన్లు ఒక అంగీకారానికి రావడంతో దేశవ్యాప్తంగా బొగ్గు కార్మికులు బుధవారం సమ్మె విరమించారు. సుమారు ఆరు గంటల సేపు బొగ్గు శాఖ మంత్రి పియుష్ గోయల్‌తో జరిగిన కార్మిక సంఘాల సమావేశం అనంతరం ఏఐటీయూసీ నేత లఖన్ లాల్ మహతో.. ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే, ఒప్పందం షరతులు, నిబంధనల గురించి మాత్రం వెల్లడించలేదు.
బొగ్గు సరఫరాపై సందిగ్ధం వీడటం .. విద్యుత్ కంపెనీలకు ఊరట కల్పించనుంది. మరోవైపు, సింగరేణిలో కూడా కార్మిక సంఘాలు సమ్మెను విరమించాయి. కోల్ ఇండియాలో డిజిన్వెస్‌మెంట్, ఈ-వేలం ద్వారా బొగ్గు గనుల కేటాయింపు తదితర అంశాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె రెండు రోజుల పాటు సాగింది. మరోవైపు, కోల్ ఇండియాను ప్రైవేటీకరించే యోచనేదీ లేదని, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని పియుష్ గోయల్ స్పష్టం చేశారు.