న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆటో మొబైల్ రంగం ఒడిదుడుకులపై చేసిన వ్యాఖ్యలు, దేశంలో ఆర్థిక మందగనంపై, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ తీవ్రంగా విమర్శించారు. సింఘ్వీ ట్విటర్ ద్వారా 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీని ఎలా నెరవేరుస్తారని మోదీని ప్రశ్నించారు. 'మోదీజీ ట్విట్టర్ ఫాలోయర్లు 50 మిలియన్లు దాటింది. ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ (డాలర్లు) దాటుతుందని చెబుతున్నారు? మరి ఎందుకు యువకులకు ఉద్యోగాలు రావడం లేదు..? దీనికి కూడా విపక్షాలే కారణమంటారా? ఉబర్, ఓలా వచ్చి అంతా నాశనం చేసింది' అని సింఘ్వీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 'మంచి జరిగితే మేమే చేశామని (మోదీనోమిక్స్), చెడు జరిగితే ఇతరులే (నిర్మలానోమిక్స్) చేశారని చెప్పడం, ప్రజలు మిమ్మల్ని అలాంటపుడు ఎందుకు ఎన్నుకోవాలి (పబ్లికోనోమిక్స్)' అని మరో ట్వీట్‌లో సింఘ్వీ వ్యంగ్యంగా విమర్శించారు.
మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టికర్తలను రక్షించుకుంటామని వాగ్దానం చేసినప్పటికీ, ప్రభుత్వ నియంతృత్వ విధానాల వల్ల గత 100 రోజులలో రూ .12.5 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపదను తుడిచిపెట్టినట్లు ఆరోపించారు. ఆధునిక యువత కొత్త కార్లను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చార్జీలు, ఈఎంఐల భారం మోయడానికి ఇష్టపడటం లేదని, అందువల్ల ఓలా, ఉబర్ క్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారని మంగళవారం రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి 100రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment