
రోహ్‌తక్ సభలో మాట్లాడుతున్న మోదీ , మోదీ ఆవిష్కరించిన చోటూరామ్ విగ్రహం
సంప్లా/రోహ్‌తక్: తమ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రైతులకు రుణాలు, పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మంగళవారం ఆయన హరియాణాలోని రోహ్‌తక్ జిల్లా గర్హి సంప్లిలో జాట్ నేత సర్ చోటూరామ్ 64 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ..‘స్వాతంత్య్రానికి ముందు రైతుల కోసం సర్ చోటూరామ్ ఎన్నో ఉద్యమాలు నడిపారు.
అన్నదాతలు ఆర్థికంగా బలపడేందుకు, వారికోసం సంక్షేమ చట్టాలు తీసుకువచ్చేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు’ అని తెలిపారు. ‘రైతుల ఉత్పత్తులకు సరైన ధర లభించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. రైతులు, చిన్న వ్యాపారులకు రుణాలు అందించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. వారు వడ్డీ వ్యాపారులపై ఆధారపడే అవసరం ఉండదు’ అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని సొనిపట్ జిల్లా బర్హిలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేసే రైల్ కోచ్ మరమ్మతు, ఆధునీకరణ కర్మాగారం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కర్మాగారంలో ఏడాదికి 250 ప్యాసింజర్ కోచ్‌లకు మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేపట్టే వీలుంటుందని తెలిపారు.
ఈ ప్రాంతంలో ఉపాధి, పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 160 ఎకరాల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు 2020–21కల్లా పూర్తవుతుందని ఉత్తర రైల్వే తెలిపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్, హరియాణా సీఎం ఖట్టర్, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హూడా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలా తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ శిల్పి, పద్మ భూషణ్ గ్రహీత రామ్ వంజి సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ ప్రాంతానికి చెందిన దాదాపు 5,500 మంది రైతులు విగ్రహ నిర్మాణానికి అవసరమైన ఇనుమును విరాళంగా ఇచ్చారు.
హడావుడిగా ఆవిష్కరణ
షెడ్యూల్ కంటే ముందుగానే జాత్ నేత సర్ చోటూరామ్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడం రాజకీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, జాట్ల మద్దతు తగ్గుతుండటంతో బీజేపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
దీంతోపాటు తొమ్మిది నెలల క్రితమే చోటూరామ్ విగ్రహ నిర్మాణం పూర్తయినా ప్రారంభించకపోవడంపై ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్‌ఎల్‌డీ) పలు ఆందోళనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రధాని మోదీ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి వచ్చిందని భావిస్తున్నారు. వాస్తవానికి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ ఒకటో తేదీన ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment