
హిందూ వ్యక్తిని పెళ్లాడటం బెటర్: ముస్లిం యువతి
ఉధమ్ సింగ్ నగర్: ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఉత్తరాఖండ్ ముస్లిం యువతి ధైర్యంగా ప్రశ్నించింది. ట్రిపుల్ తలాక్ మూలంగా తన సోదరికి జరిగిన అన్యాయంపై రగిలిపోయిన యువతి.. ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కచ్చా పోలీసుల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాక్ చెప్పి ఏ క్షణంలో అయినా భార్యను వదిలేయడానికి అవకాశం ఉన్న వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండటంలో ఉపయోగం ఏంటని అడిగింది. ఒకవేళ వయసైపోయిన ఓ మహిళ విషయంలో ఈ అన్యాయం జరిగితే.. ఆమె పరిస్థితి ఏంటని ప్రశ్నించింది.
'ఓ యుక్త వయసులో ఉన్న మహిళగా ట్రిపుల్ తలాక్ గురించి భయపడుతూ జీవితాంతం నేనెందుకు బతకాలి. దీనికన్నా హిందూ మతాన్ని స్వీకరించి.. మూడు పదాలను ఉచ్ఛరించడం ద్వారా నా జీవితాన్ని నాశనం చేయడానికి అవకాశం లేని హిందూ వ్యక్తిని పెళ్లాడటం బెటర్' అని అంది. దేశంలో మహిళలు, ముఖ్యంగా ముస్లిం మహిళల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న చర్యలు బాగున్నాయని హిజాబ్ ధరించిన సదరు ముస్లిం యువతి స్పష్టం చేసింది. వాట్సప్, ఫేస్‌బుక్‌లలో సైతం ట్రిపుల్ తలాక్ చెబుతున్న సంఘటనల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ పద్దతికి స్వస్తి చెప్పాలని కోరుతున్న విషయం తెలిసిందే.