ప్రతీకాత్మక చిత్రం
రాయ్‌పూర్ : ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుల మధ్య తలెత్తిన వివాదం.. కాల్పులకు దారితీసింది. దీంతో ఆవేశానికి లోనైన ఓ జవాన్ తన సహచరులపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పులో అతనితో పాటు మరో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నారాయణపూర్‌లోని కేదార్‌నార్ క్యాంప్‌లోని ఐటీబీపీ 45వ బెటాలియన్‌కు చెందిన కొందరు జవాన్ల మధ్య బుధవారం ఉదయం వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా ఆగ్రహానికి లోనైన ఐటీబీపీ కానిస్టేబుల్ మసుదుల్ రెహమాన్.. తన సర్వీస్ రివాల్వర్‌తో సహచరులపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రెహమాన్‌తో సహా 6గురు జవాన్లు మరణించగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని హెలికాఫ్టర్‌లో రాయ్‌పూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని బస్తర్ రెంజ్‌ఐజీ సుందర్‌రాజ్ ధ్రువీకరించారు.
ఈ ఘటనపై సుందర్‌రాజ్ మాట్లాడుతూ.. ‘జవాన్ల మధ్య వివాదం తలెత్తడంతో రెహమాన్.. తన తోటి సహచరులపైకి కాల్పులు జరిపాడు. అయితే రెహమాన్ తనను తాను కాల్చుకున్నాడా లేక అతని సహచరులు ఎదురుకాల్పులు జరపడం వల్ల మరణించాడా అనేది తెలియాల్సి ఉంది. ఇందుకోసం ఈ ఘటనలో చనిపోయిన జవాన్ల రివాల్వర్లను పరిశీలించాల్సి ఉంద’ని తెలిపారు. మృతులను ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్స్ దుల్జీత్, ఎమ్ సింగ్, కానిస్టేబుల్స్ సుజిత్ సర్కార్, బిశ్వరూప్, బ్రిజేష్‌లుగా గుర్తించారు. గాయపడ్డవారిలో కానిస్టేబుల్స్ ఎస్‌బీ ఉల్లాస్, సీతారామ్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment