సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటడంతో దేశ రాజధానిలో మొబైల్ సేవలు, ఇంటర్‌నెట్‌ను నిలిపివేశారు. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాలతో పాటు సమస్యస్మాతక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సర్వీసులను నిలిపివేయాలని ఢిల్లీ పోలీసులు ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో, ఎంటీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్ సహా టెలికాం ఆపరేటర్లను కోరారు. పోలీసుల ఆదేశాలతో ఉత్తర, మధ్య జిల్లాల్లోని పలు ప్రాంతాలు, మండీ హౌస్, సీలంపూర్, జఫ్రాబాద్, ముస్తఫాబాద్, జామియా నగర్, షహీన్ బాగ్, బవానా ప్రాంతాల్లో ఆయా సేవలను నిలిపివేశామని ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కువ మంది గుమికూడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కాగా కనెక్టివిటీ ఫిర్యాదులపై టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ ట్విటర్‌లో స్పందించింది. ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చిన సూచనల మేరకే వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్, డేటా సర్వీసులను ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నిలిపివేశామని, ఈ ఉత్తర్వులను ఎత్తివేసిన తర్వాత సాధారణ సేవలను పునరుద్ధరిస్తామని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. మరోవైపు పౌర చట్టంపై నిరసనలను హోరెత్తడంతో ఢిల్లీ మెట్రో 19 స్టేషన్‌లను మూసివేసింది. మెట్రో స్టేషన్‌లను మూసివేసిన క్రమంలో ట్రాఫిక్ జామ్‌లు ఇవిపరీతంగా పెరిగాయి. ఇక ఢిల్లీ-గుర్‌గావ్ సరిహద్దును పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. రాజకీయ, సామాజిక కార్యకర్త యోగీంద్ర యాదవ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment