
న్యూఢిల్లీ: రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రంలో పరిపాలన సాగనప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి, నేరుగా ఆ రాష్ట్రాన్ని కేంద్రమే పరిపాలిస్తుంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పాలనా యంత్రాంగాన్ని చేతుల్లోకి తీసుకుంటుంది. కేంద్రం నియమించిన గవర్నర్ నేతృత్వంలో పాలన సాగుతుంది. పాలనా విషయాల్లో తనకు సాయపడేందుకు అధికారులను సైతం నియమించుకునే హక్కు గవర్నర్‌కి ఉంటుంది. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించారు. 1954లో ఉత్తరప్రదేశ్‌లో తొలిసారి ఆర్టికల్ 356ని ప్రయోగించారు. రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మాత్రమే.
ఏఏ సందర్భాల్లో అవకాశముందంటే...
- ఒక రాష్ట్ర శాసన సభ ఆ రాష్ట్ర గవర్నర్ నిర్దేశించిన సమయంలో సీఎంను ఎన్నుకోలేనప్పుడు.
- సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి ముఖ్యమంత్రికి మైనారిటీ సభ్యుల మద్దతు మాత్రమే మిగిలినప్పుడు, గవర్నర్ ఇచ్చిన. సమయంలో తిరిగి ప్రభుత్వ ఏర్పాటులో వైఫల్యం చెందినప్పుడు.
- సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో మెజారిటీ సభ్యుల మద్దతు కోల్పోయినా రాష్ట్రపతి పాలనకు అవకాశం.
- రాష్ట్రంలో యుద్ధపరిస్థితులు తలెత్తినప్పుడు, లేదా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎన్నికలు వాయిదా వేయాల్సిన సందర్భాల్లో కూడా అవకాశం ఉంది.
- రాజ్యాంగ బద్దంగా రాష్ట్రంలో పాలన సాగడం లేదని గవర్నర్ రిపోర్టు ఇచ్చినప్పుడు కూడా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది.
- 1994లో ఎస్‌ఆర్.»ొమ్మై వర్సెస్, యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో... రాష్ట్రపతి పాలన విధించే విషయంలో సుప్రీంకోర్టు కఠినమైన నిబంధనలను పొందుపరిచింది. అప్పటిదాకా దేశంలో చాలా సార్లు రాష్ట్రపతిపాలన విధించారు. ఆర్టికల్ 356 దురి్వనియోగానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అడ్డుకట్ట వేయగలిగాయి. 2000వ సంవత్సరం తరువాత దేశంలో రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు బాగా తగ్గాయి.
ఎంతకాలం ఉండొచ్చు
పార్లమెంటులోని రెండు సభలు ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన ఆరునెలల పాటు కొనసాగించవచ్చు. ఆ తరువాత ఎన్నికల కమిషన్ తదుపరి ఎన్నికలను ఖరారు చేయొచ్చు. రాష్ట్రపతి పాలనను గరిష్టంగా మూడళ్ల వరకు కొనసాగించవచ్చు. అయితే ఈ కాలంలో ఆరు నెలలకోసారి పార్లమెంటు ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.
ఎప్పుడు ఎత్తివేయొచ్చు
పార్లమెంటు ఆమోదంతో పనిలేకుండా ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది.
సర్కారియా కమిషన్ ఏం చెప్పింది?
రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలనను కొనసాగించడంలో అన్ని అవకాశాలూ మూసుకుపోయినప్పుడు, రాష్ట్రప్రభుత్వ పాలన కొనసాగింపునకు అన్ని ప్రత్యామ్నాయాలూ అంతరించి పోయినప్పుడు, తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే చిట్టచివరి ప్రయత్నంగా రాష్ట్రపతి పాలన విధించాలని 1983లో సర్కారియా కమిషన్ స్పష్టం చేసింది. డాక్టర్ అంబేద్కర్ సైతం రాష్ట్రపతి పాలనను ‘‘డెడ్ లెటర్’’అని (అతి తక్కువగా ఉపయోగించాలని) అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment