ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కాలని ప్రయత్నాలు చేస్తున్న శివసేన చిరకాల మిత్రుడైన కమలదళంపై కస్సుమంటోంది. రాష్ట్రపతి పాలన ముసుగులో బీజేపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తోందని శివసేన పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌లు తమ పార్టీకి 119 (స్వతంత్ర అభ్యర్థులు 14 మందితో కలిపి) ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమ పార్టీ సహకారం లేకుండా మరెవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టింది.
మేజిక్ ఫిగర్ అయిన 145 మంది ఎమ్మెల్యేలు మద్దతు లేకపోవడం వల్లే బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆహ్వానాన్ని ఆ పార్టీ తిరస్కరించిందని గుర్తు చేసింది. క్రికెట్‌లోనూ, రాజకీయాల్లోనూ ఆఖరి క్షణంలో ఏదైనా జరగొచ్చునన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపైనా సామ్నా ఎడిటోరియల్ విరుచుకుపడింది. ఇవాళ, రేపు క్రికెట్ అంటే ఆట తక్కువ, వ్యాపారం ఎక్కువ అన్నట్టుగా తయారయ్యాయని వ్యాఖ్యానించింది.
అంతేకాదు క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ సర్వసాధారణమైపోయిందని, అప్పుడే విజయం వరిస్తోందని పేర్కొంది. బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై వలవేసి రాజకీయ క్రీడలో గెలవాలని చూస్తోందని సామ్నా తన సంపాదకీయంలో ఆరోపించింది. మరోవైపు ఎన్సీపీ కూడా బీజేపీపై ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. తమ పార్టీ త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఇతర పార్టీల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఎమ్మెల్యేలను తమ గూటికి లాగాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
గవర్నర్‌తో భేటీ వాయిదా
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ఇంకా ముందుకు కదలలేదు. వాస్తవానికి శనివారమే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి చర్చించి, ఆ తర్వాత గవర్నర్‌తో భేటీ కావాలని భావించారు. కానీ ఈ సమావేశాలన్నీ వాయిదా పడ్డాయి. ఆదివారం శరద్ పవార్, సోనియాతో కలిసే అవకాశాలున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అనుసరించాల్సిన విధివిధానాలపై పవార్ సోనియాతో చర్చించాక మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠపై ఒక స్పష్టత రానుంది.
ఎన్డీయే భేటీకి సేన దూరం
ఈ నెల 18న ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం ఎన్డీయే సమావేశం కానుంది. ఈ సమావేశానికి తాము హాజరు కాబోమని శివసేన స్పష్టం చేసింది. ఎన్డీయేకి రాం రాం చెప్పడం ఇక లాంఛనప్రాయమేనని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ విలేకరులకు చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఉన్న శివసేనకు చెందిన ఒకే ఒక మంత్రి అరవింద్ సావంత్ ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఎప్పుడైతే 50:50 ఫార్ములాకు బీజేపీ అంగీకరించలేదో అప్పట్నుంచే తాము ఎన్డీయేకి దూరమయ్యామని రౌత్ స్పష్టం చేశారు.
పార్లమెంటులో విపక్ష స్థానాల్లో సేన ఎంపీలు
పార్లమెంటు సమావేశాల్లో శివసేన పార్టీ ఎంపీలు కూర్చొనే స్థానాలు ఇకపై మారిపోనున్నాయి. శివసేన ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిపక్షం వైపు అయిదో వరసలో ఇక కూర్చోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment